బాలోత్సవాల నిర్వహణకు రూ.25 లక్షలు..ర్యాంకులతో పిల్లల ప్రతిభను కొలవొద్దు: మంత్రి జూపల్లి కృష్ణారావు

బాలోత్సవాల నిర్వహణకు రూ.25 లక్షలు..ర్యాంకులతో పిల్లల ప్రతిభను కొలవొద్దు: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: విద్యతోనే పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని.. కేవలం ర్యాంకులు, మార్కులతోనే వారి సామర్థ్యాన్ని అంచనా వేయకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చదువుతోపాటు చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి కళలు, క్రీడలు, సృజనాత్మక రంగాల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు.  

రాష్ట్రంలోని బాలోత్సవాల నిర్వహణకు రూ.25 లక్షలు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌‌‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ బాలోత్సవం–6వ పిల్లల జాతరలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, వారిని అభినందించారు.

అనంతరం జూపల్లి మాట్లాడుతూ.. పిల్లల అభిరుచులు, నైపుణ్యాలకు తగిన అవకాశాలు కల్పించి వారి సమగ్ర, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలని కోరారు. కాగా..ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ చుక్కా రామయ్య 100వ బర్త్ డే  సందర్భంగా ఆయనకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుభాకాంక్షలు తెలిపారు.