తెలంగాణలో కొత్తగా 100 రెసిడెన్షియల్‌ పాఠశాలలు : భట్టి విక్రమార్క

తెలంగాణలో కొత్తగా 100  రెసిడెన్షియల్‌ పాఠశాలలు  :  భట్టి విక్రమార్క

తెలంగాణలో రూ. 100 కోట్లతో  ఇంటర్నేషనల్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్  పాఠశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయింది.  దీనికి రూ.2 వేల500  కోట్లు కేటాయించింది.   ఎస్సీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు వేర్వేరుగా కాకుండా ఒకే చోట నిర్మించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పైలెట్‌ ప్రాజెక్టును తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో చేపట్టనున్నట్టు వెల్లడించారు. 

మండల కేంద్రమైన చింతకానిలోని ఇండోర్‌ స్టేడియం సమీపంలో 10 ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనారిటీ బాలుర, ఎర్రుపాలెం మండలంలో బాలికల సమీకృత రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మిస్తామని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియ‌ల్  పాఠశాలల కోసం స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.  ఒకేచోట నిర్మిస్తే స్థలాల సమస్య అధిగమించడంతో పాటు మినీ ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు వీలవుతుందన్నారు.

మరోవైపు  ప్రభుత్వ ఉద్యోగాల పోటీ ప‌రీక్షల‌కు సిద్దమ‌య్యే నిరుద్యోగుల‌కు కోచింగ్ సౌక‌ర్యం కోసం నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల వారీగా నాలేడ్జ్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలో టీఎస్‌పీఎస్సీ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించనున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి నిరుద్యోగులకు కోచింగ్‌ భారం పడకుండా ఈకేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు.