నిరసన గళం: హుజూరాబాద్ బరిలో 1200 మంది..

నిరసన గళం: హుజూరాబాద్ బరిలో 1200 మంది..

కరీంనగర్, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై నిరసన గళం విన్పించడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు హుజూరాబాద్‍ ఉప ఎన్నికను వేదికగా చేసుకుంటున్నారు. నిజామాబాద్ పసుపు రైతుల స్ఫూర్తితో తమ బాధను రాష్ట్రమంతటికీ తెలియజెప్పడానికి బరిలో దిగుతున్నారు. ఏకంగా 1,200 మంది హుజూరాబాద్ లో నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. వీరిలో 1,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కాగా 200 మంది నిరుద్యోగులు. ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి భాగస్వామ్యం ఉండేలా జిల్లాకు 31 మంది చొప్పున అసిస్టెంట్లు బరిలో దిగుతున్నారు. వీరంతా ఇప్పటికే డిక్లరేషన్ల ఫారాలు తీసుకున్నారు. శుక్రవారం నోటిఫికేషన్‍ రానుండటంతో రెండు రోజుల్లో నామినేషన్లు వేయనున్నారు. ఖర్చుల కోసం భిక్షాటన చేస్తున్నారు. ‘‘హుజూరాబాద్‍ లో ఊరూరూ తిరుగుతం. ఉపాధి హామీ కూలీలను, మహిళలను, రైతులను అందరినీ కలుస్తం. మాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తం. టీఆర్‍ఎస్‍ అభ్యర్థికి ఓటెయ్యొద్దని ప్రచారం చేస్తం” అని వారు చెబుతున్నారు.

18 నెలల వేదన

కేంద్రం 2006లో ఉపాధి హామీ పథకం తెచ్చింది. పనుల పర్యవేక్షణకు ఊళ్లలో ఫీల్డ్ అసిస్టెంట్లను తీసుకున్నారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా 7,561మంది ఉన్నారు. జీతం రూ.1,200 నుంచి రూ.2,200 , 3,400, 5,500 ఇస్తూ వచ్చారు. ఏండ్లుగా ఈ జీతాలతోనే పథకం విజయవంతంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ వచ్చాక అలవెన్సులతో కలిపి జీతం రూ.10 వేలు చేశారు. 2019లో తమకు వ్యతిరేకంగా జారీ చేసిన సర్క్యులర్​ను రద్దు చేయాలని అడిగినందుకు 2020 మార్చి 23న రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ విధుల నుంచి తొలగించారు. దాంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఉద్యోగాలు పోయి, 18 నెలలుగా జీతాల్లేక కుటుంబాన్ని పోషించుకోలేక చాలామంది డిప్రెషన్‍కు గురయ్యారు. 52 మంది చనిపోయారు. వీటిలో ఎక్కువగా సూసైడ్‍లే! ఎమ్మెల్యేలకు, మంత్రులకు మొరపెట్టకున్నా లాభం లేకపోకుండా పోయింది. తిరిగి విధుల్లోకి తీసుకుంటామని దుబ్బాక ఉప ఎన్నికప్పుడు మంత్రి హరీశ్ రావు వీరికి హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ఓడిపోవడంతో తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. నాగార్జునసాగర్‍ ఉప ఎన్నికప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే రిపీటైంది. దాంతో, ఉద్యోగాలను సాధించుకునేందుకు, తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు నేరుగా ఎన్నిక బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వపోవడం, ఖాళీలు భర్తీ చేయకపోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

కేసీఆర్ కు బుద్ధి చెప్తం

1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లం బరిలో దిగుతున్నం. టీఆర్ఎస్ అభ్యర్థిని ఒడగొట్టి కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తం. ఉద్యోగాలు ఊడి 52 మంది అసిస్టెంట్లు చచ్చిపొయిన్రు. కుటుంబాలు రోడ్డుపాలైనై. ఇంటింటికి తిరిగి మాకు జరిగిన అన్యాయాన్ని చెప్తం. ప్రభుత్వం ఎట్ల వంచించిందో వివరిస్తం. రెండు రోజుల్లో అందరం నామినేషన్లు వేస్తం. మా సత్తా చూపిస్తం. 
–శ్యామలయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ జేఏసీ చైర్మన్