
- 112 మంది పైలెట్ల సిక్ లీవ్
- పార్లమెంటుకు తెలిపిన కేంద్రం
- ప్రమాద ఘటనతో పైలెట్లు
- మానసిక ఒత్తిడికి గురయ్యారని వెల్లడి
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఇండియా పైలెట్లు సామూహిక సెలవు పెట్టారు. ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న 61 మంది ఫ్లైట్ కమాండర్లు, 51 మంది ఫ్లైట్ ఆఫీసర్లు నాలుగు రోజులపాటు సిక్ లీవ్ తీసుకున్నారు. ఈ విషయాన్ని విమానయాన మంత్రి మురళీధర్ మోహోల్ గురువారం పార్లమెంటులో వెల్లడించారు. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది సెకన్లలోనే కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి భయంకర ప్రమాదంతో పైలెట్లు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యారని మంత్రి పేర్కొన్నారు. పైలెట్ల ఆరోగ్యం, మానసిక పరిస్థితిని ఎప్పిటికప్పుడు పరిశీలించడం ఎంత ముఖ్యమో దీనిద్వారా అర్థం చేసుకోవచ్చన్నారు. పైలెట్లకు వైద్య పరీక్షలు చేసే సమయంలో వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా అంచనా వేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని ఎయిర్‌లైన్స్‌కు 2023లోనే సూచనలు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేలా ఫ్లైట్ క్రూ మెంబర్లు, ట్రాఫిక్ కంట్రోలర్లకు కూడా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సూచించామన్నారు. ఏదైనా ప్రమాదం ఏర్పడితే వాళ్లందరికీ సాయం చేసేలా సపోర్టింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించామని చెప్పారు.
ఎయిర్ ఇండియాకు డీజీసీఏ నోటీసులు
విమానాల్లో భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డీజీసీఏ నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్యాబిన్ క్రూ విశ్రాంతి, శిక్షణ నిబంధలు, నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి గడిచిన 12 నెలల్లో ఉల్లంఘనలు జరిగినట్లు ఎయిర్‌ఇండియా కూడా అంగీకరించింది. వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. డీజీసీఏ నుంచి అందుకున్న నోటీసులకు కూడా సమాధానమిస్తామంది.