
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని శాస్త్రి నగర్‌లో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. 13 ఏళ్ల ఓ పిల్లాడు కేవలం మ్యాగీ నూడుల్స్ కొనడానికి డబ్బు కోసం తన సోదరి ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని తీసుకెళ్లి ఒక నగల దుకాణంలో అమ్మడానికి ప్రయత్నించాడు. దీని బట్టి పిల్లల్లో నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్ పట్ల ఎంత మోజు ఉందో తెలియజేస్తుంది. నగల షాపు ఓనర్ ఆ పిల్లాడి తల్లికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
సమాచారం ప్రకారం ఓ పిల్లాడు నగల షాపుకి వెళ్లి బంగారు ఉంగరాన్ని ఇచ్చి డబ్బులు కావాలని అడిగాడు. షాపు ఓనర్ పుష్పేంద్ర జైస్వాల్ అతడి అమాయకత్వాన్ని గమనించి కొన్ని ప్రశ్నలు అడగ్గా... అప్పుడు ఆ పిల్లాడు మ్యాగీ కొనడానికి డబ్బులు అవసరమని, అందుకే ఈ ఉంగరం తెచ్చానని చెప్పాడు.
దింతో అనుమానం వచ్చిన నగల వ్యాపారి వెంటనే ఆ పిల్లాడి తల్లిని షాపుకి పిలిపించి ఉంగరాన్ని చూపించాడు. ఆమె ఆ ఉంగరాన్ని చూసి షాక్ అయ్యి, అది తన కూతురి ఎంగేజ్మెంట్ ఉంగరం అని, త్వరలోనే పెళ్లి ఉందని చెప్పింది.
పుష్పేంద్ర జైస్వాల్ మాట్లాడుతూ, పిల్లలు తెచ్చిన వస్తువులను మార్కెట్‌లో ఎవరూ కొనరని, అలాగే ఆ పిల్లాడి అమాయకత్వాన్ని చూసి ఆ ఉంగరాన్ని తల్లికి తిరిగి ఇచ్చేశారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగల వ్యాపారి పుష్పేంద్ర జైస్వాల్ నిజాయితీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.