
- కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ, ఇతర బోర్డులు
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సమాయత్తం అవుతోంది. ఇందు కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సహా వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల నుంచి వివరాలు సేకరిస్తున్నాయి.
గ్రూప్1 సర్వీసెస్ కోసం 563 పోస్టుల భర్తీకి సెలెక్షన్ లిస్టు ఇటీవలే టీజీపీఎస్సీ రిలీజ్ చేయగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఈమధ్యే 783 మందికి పోస్టులకు సంబంధించిన గ్రూప్2 సెలెక్షన్ లిస్టునూ విడుదల చేశారు. లోకల్ బాడీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులతో సర్కారు చర్చించి, త్వరలోనే నియామక పత్రాలు అందించనున్నారు.
ఈ క్రమంలోనే గ్రూప్ 3 పోస్టుల భర్తీకి వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది. అయితే, గ్రూప్ 3 నియామక ప్రక్రియనూ అక్టోబర్లోపే పూర్తిచేసే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉంది. ఈ ప్రక్రియ ముగియగానే.. కొత్త రిక్రూట్మెంట్లపై కమిషన్ దృష్టి పెట్టాలని డిసైడ్ అయింది. ఇప్పటికే అగ్రికల్చర్, విద్యా శాఖతో పాలు పలు డిపార్ట్మెంట్ల నుంచి వివరాలు సేకరించింది. కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ల డేటానూ తీసుకున్నది.
కొత్త నోటిఫికేషన్లకు కసరత్తు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తికాక ముందే సుమారు 60 వేలకు పైగా నియామకాలు పూర్తి చేసింది. డిసెంబరులో రెండేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అప్పటిలోపు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలనే యోచనలో సర్కారు ఉన్నది. ఈ క్రమంలో కనీసం 25 వేల పోస్టులనైనా భర్తీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పోలీస్ శాఖలో 17 వేల ఖాళీలున్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని కొత్త డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.
వివిధ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను, సర్కారు బడుల్లో టీచర్ పోస్టులు, డిప్యూటీ డీఈఓ, డైట్, బీఈడీ కాలేజీల్లో లెక్చరర్లు, ఎస్సీఈఆర్టీలో ఖాళీలను నింపాలని టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు హెల్త్ శాఖతో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎలక్ర్టిసిటీ, యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. వీటన్నింటికీ నవంబరు లేదా డిసెంబరు మొదటి వారంలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క గ్రూప్ 1, 2, 3, 4 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.