
ములుగు, వెలుగు : నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ బిల్డింగ్ పైనుంచి పడి ఓ కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన సిరిపెల్లి రాజయ్య (50) గట్టమ్మ ఆలయ సమీపంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణంలో కూలీ పనులు చేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం కూడా పనికి వచ్చిన రాజయ్య ఇనుప పైపులు మోస్తుండగా ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి కిందపడ్డాడు. తలతో పాటు ఇతర భాగాలకు తీవ్రగాయాలు కావడంతో గమనించిన మిగతా కార్మికులు 108లో ములుగు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు రాజయ్య అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. రాజయ్యకు భార్య సుమలతతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజయ్య కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎమ్మార్పీఎస్, ఇతర ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.