అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్‌‌ఎస్‌‌.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్‌‌ఎస్‌‌.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
  • బీఆర్‌‌ఎస్‌‌ ఝూటా మాటల కార్డులను పంచాలా ? ..మంత్రి సీతక్క

మహబూబాబాద్, వెలుగు : పదేండ్లు పాలించిన బీఆర్‌‌ఎస్‌‌ ప్రజలకు ఇచ్చిన ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్‌‌ జిల్లా గంగారంలో మండలంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని, మాట తప్పితే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్‌‌.. తర్వాత మాట మార్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 

దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, వ్యవసాయానికి ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, రుణమాఫీ, పేదలందరికీ డబుల్ బెడ్‌‌రూమ్‌‌ ఇండ్లు, లక్ష ఉద్యోగాల వంటి హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. బీఆర్‌‌ఎస్‌‌ ఝూటా మాటల కార్డులను తాము కూడా పంపిణీ చేయాలా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలవుతుండడంతో కాంగ్రెస్‌‌ బాకీ కార్డు పేరుతో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాకే గ్రూప్ వన్‌‌, టూ, త్రీ, ఫోర్, డీఎస్సీ ఫలితాల విడుదల, పోలీసు ఉద్యోగాల భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. పేదింటి కుటుంబాల పిల్లలు గ్రూప్‌‌ 1లో ర్యాంక్‌‌లు సాధిస్తే.. కోట్లు కుమ్మరించి ఉద్యోగాలు కొనుక్కున్నారని కేటీఆర్‌‌ అనడం వారిని అవమానించడమేనన్నారు.

 బీసీ కులగణనలో పాల్గొనని బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ నాయకులకు 42 శాతం రిజర్వేషన్‌‌పై మాట్లాడే హక్కు లేదన్నారు. బీసీ బిడ్డ అయిన ఎంపీ ఈటల రాజేందర్‌‌ రిజర్వేషన్ల అమలుపై విమర్శలు చేయడం దారుణం అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, అసత్య ప్రచారాలు చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ క్యాండిడేట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.