స్థానిక పోరులో బీసీల జోష్.. 22 శాతం నుంచి 42 శాతానికి పెరిగిన రిజర్వేషన్

స్థానిక పోరులో బీసీల జోష్.. 22 శాతం నుంచి 42 శాతానికి పెరిగిన రిజర్వేషన్
  • 22 శాతం నుంచి 42 శాతానికి పెరిగిన రిజర్వేషన్​
  • పోటీకి సిద్ధమవుతున్న ముఖ్య నేతలు
  • జడ్పీటీసీ స్థానాలపై సెకండ్ కేడర్ నేతల ఫోకస్​

నిజామాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది.  22 శాతం నుంచి 42 శాతానికి రిజర్వేషన్​ పెంచడంతో బరిలో నిలిచేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు. గతంలో రాజకీయంగా ఎదగనివారు ఈసారి గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పదవుల సంఖ్య పెరుగనుండడంతో బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓసీ కేటగిరీలవారు పోటీకి సై అంటున్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పించడంతో మహిళా ప్రతినిధుల సంఖ్య పెరుగనున్నది.

గతంలో బీసీ సర్పంచ్​లు 98 కాగా, ఇప్పుడు 201

2018లో జరిగిన ఎన్నికల్లో 530 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వాటిలో వంద శాతం గిరిజన ఓటర్లు ఉన్న 31 పంచాయతీలను ఎస్టీలకు రిజర్వు చేయగా, ఎస్సీలకు 101, బీసీలకు 98 కేటాయించారు. ఓసీలు 229  సర్పంచ్ పదవులు పొందారు. 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలైనప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత పదవులు దక్కలేదు. గవర్నమెంట్ ఈసారి రిజర్వేషన్లు మార్చడంతో పాటు ప్రజా అవసరాల దృష్ట్యా జీపీల సంఖ్య 545కు పెంచింది. దీంతో 201 మంది బీసీలు సర్పంచ్​లుగా ఎన్నికయ్యే వీలుంది.

 ఇందులో 92 మంది మహిళలు ఉండబోతున్నారు. 41 మంది మహిళలు కలిపి మొత్తం 96 మంది ఎస్టీలు, 35 మంది మహిళలు కలిపి ఎస్సీలు 82 మంది సర్పంచ్ పదవులు పొందనున్నారు. 166 ఓసీలు పల్లె పాలన పగ్గాలు చేపట్టనున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,417 కాగా,  మహిళలు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, 18 మంది ఇతరులు ఉన్నారు.  అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం లభించడంతో  ప్రజా సేవకుల సంఖ్య గణనీయంగా పెరుగనుంది.

జడ్పీ పీఠం సహా..

జిల్లాలో ఐదేండ్ల కింద 27 మండలాలు మాత్రమే ఉండగా, కొత్తగా ఆలూర్​, డొంకేశ్వర్​, పోతంగల్ సాలూరా మండలాలు ఏర్పడ్డాయి. దీంతో మండలాల సంఖ్య 31కు చేరింది.  31 జడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు 13 స్థానాలు కేటాయించారు. అందులో ఆరు స్థానాల్లో పోటీ చేసేందుకు బీసీ మహిళలను చాన్స్​ రాగా, ఒకరికి జడ్పీ చైర్​పర్సన్ పదవి దక్కే అవకాశం ఉంది. 31 ఎంపీపీ పదవుల్లో బీసీలకు 13 పోస్టులు కేటాయించగా ఆరుగురు మహిళలు పదవులు పొందనున్నారు. ఈ పోస్టుల కోసం అన్ని పార్టీల నుంచి సెకండ్​ కేడర్​ నేతలు పోటీ పడుతున్నారు. మండలాల సంఖ్య పెరిగినందున ఎంపీటీసీ స్థానాలు 307కు చేరాయి.