ఇలా హోమ్ లోన్ ప్లాన్ చేస్తే కట్టాల్సిన వడ్డీ సున్నా.. పక్కా ప్లాన్ లెక్కలతో సహా..

ఇలా హోమ్ లోన్ ప్లాన్ చేస్తే కట్టాల్సిన వడ్డీ సున్నా.. పక్కా ప్లాన్ లెక్కలతో సహా..

భారతదేశంలో ప్రజలకు సొంతిల్లు కొనుక్కోవటం లేదా తమ పూర్వీకుల స్థలంలో ఇల్లు కట్టుకోవటం పెద్ద జీవిత కల. దీనిని సాకారం చేసుకోవటం కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. ప్రస్తుత కాలంలో పెరిగిన ధరలతో బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవటమే చాలా మందికి తమ కల నెరవేర్చుకునే మార్గంగా మారిపోయింది. అయితే వడ్డీ భారాన్ని సున్నాగా మార్చుకుని సొంతింటి కోసం రుణాన్ని తెలివిగా ఉపయోగించుకునే ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 

మీరు హోమ్ లోన్ తీసుకున్న వెంటనే దానితో పాటు చిన్న ఎస్ఐపీ ప్రారంభించాలి. నెలకు కనీసం రూ.15 వందల నుంచి రూ.2వేల పెట్టుబడి చేయటం ద్వారా మీరు హోమ్ లోన్ చెల్లింపులు పూర్తి చేసేనాటికి దాని నుంచి వచ్చే రాబడి మీరు రుణానికి చెల్లించే వడ్డీని అధిగమిస్తుంది. అదెలాగో ఇప్పుడు లెక్కలు గమనిద్దాం.

ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ 7.50 శాతం చొప్పున హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది. ఈ వడ్డీ రేటుకు రూ.30 లక్షలు రుణాన్ని 30 ఏళ్ల కాలానికి తీసుకున్నట్లయితే నెలకు రూ.20వేల 976 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఈ 30 ఏళ్ల కాలంలో బ్యాంకుకు రుణం తీసుకున్న వ్యక్తులు వడ్డీగా రూ.45లక్షల 51వేల 517 చెల్లిస్తారు. అలాగే అసలు మెుత్తం కలిపితే రుణ గ్రహీత రూ.75లక్షల 51వేల 517 కట్టాల్సి ఉంటుంది చివరికి. ఇది తీసుకున్న రుణ మెుత్తానికి డబుల్ దాటేస్తుంది. 

Also Read : మండిపోతున్న బంగారం, వెండి రేట్లు.. తులం రూ.లక్షా 20వేలు దాటేసిన గోల్డ్

కానీ పైన చెప్పుకున్నట్లుగా నెలకు ఎస్ఐపీ పెట్టుబడి స్టార్ట్ చేస్తే కట్టిన వడ్డీ పోగా హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తికే లాభం చేకూరుతుంది. సదరు వ్యక్తి నెలకు రూ.1700 మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపీగా పెట్టుబడి పెడితే సగటు 12 శాతం రాబడి ప్రకారం 30 ఏళ్ల కాలం పూర్తయ్యే సరికి మెచ్యూరిటీ విలువ రూ.52లక్షల 37వేల 654కి చేరుకుంటుంది. ఇది హోమ్ లోన్ చెల్లింపుల సమయంలో బ్యాంకుకు కట్టిన రూ.45లక్షల 51వేల 517 వడ్డీ కంటే ఎక్కువ. ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు సున్నా వడ్డీకే హోమ్ లోన్ పొందినట్లు అవుతుంది చివరికి.