తప్పిన విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 లో అత్యవసరంగా రాట్ వాడకం

తప్పిన విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 లో అత్యవసరంగా రాట్ వాడకం

ముంబై: అమృత్‌‌సర్–బర్మింగ్‌‌హామ్ రూట్‌‌లో తిరిగే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలో శనివారం (అక్టోబర్ 4న) ర్యామ్‌‌ ఎయిర్ టర్బైన్‌‌ (రాట్‌‌) ను అత్యవసరంగా వాడాల్సి వచ్చిందని, అయినప్పటికీ  విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా తెలిపింది.  ఇంజిన్, ఎలక్ట్రిక్ లేదా హైడ్రాలిక్ ఫెయిల్యూర్ సమయంలో అత్యవసరంగా కరెంట్‌ను  ఉత్పత్తి చేయడానికి రాట్‌‌ వాడతారు.  

ఈ ఘటన తర్వాత బర్మింగ్‌‌హామ్–ఢిల్లీ విమానాన్ని రద్దు చేసి, తనిఖీ కోసం గ్రౌండ్ చేశారు.  బస్ పవర్ కంట్రోల్ యూనిట్ (బీపీసీయూ) లో లోపం వలన రాట్‌‌ను  వాడాల్సి వచ్చిందని అంచనా వేస్తున్నారు. ఇదే తరహాలో ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్‌‌‌‌ ఇండియా  బోయింగ్ 787–-8 విమానం టేకాఫ్ తర్వాత 30 సెకన్లలో కుప్పకూలిన విషయం తెలిసిందే. 

ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌‌లు అనుమానాస్పదంగా ఆఫ్ అవ్వడంతో ఈ యాక్సిడెంట్ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో  దేశంలోని అన్ని బోయింగ్ 787  విమానాల్లో ఎలక్ట్రికల్ సిస్టమ్‌‌ను పూర్తిగా తనిఖీ చేయాలని  ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలెట్స్‌‌ (ఎఫ్‌‌ఐపీ) డీజీసీఏని కోరింది.