ఈ వారం రిజల్ట్స్‌‌పై ఫోకస్‌‌... అక్టోబర్ 9న టీసీఎస్‌‌ క్యూ2 ఫలితాలు

ఈ వారం రిజల్ట్స్‌‌పై ఫోకస్‌‌... అక్టోబర్ 9న టీసీఎస్‌‌ క్యూ2 ఫలితాలు

న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ డైరెక్షన్‌‌ను  మాక్రో ఎకనామిక్ డేటా, గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్‌‌, టీసీఎస్ సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) ఫలితాలు ప్రభావితం చేయనున్నాయని ఎనలిస్టులు తెలిపారు. సెప్టెంబర్‌‌లో విదేశీ పోర్ట్‌‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌‌పీఐలు) రూ.23,885 కోట్ల (సుమారు 2.7 బిలియన్ డాలర్ల) విలువైన షేర్లను అమ్మారు. ఈ ఏడాది మొత్తంగా రూ.1.58 లక్షల కోట్ల (17.6 బిలియన్ డాలర్ల)ను ఇండియన్ మార్కెట్ల నుంచి విత్‌‌డ్రా చేసుకున్నారు.  “ఈ వారం కీలకం కానుంది. క్యూ2 రిజల్ట్స్ సీజన్ ప్రారంభమవుతోంది. ఐటీ కంపెనీ టీసీఎస్‌‌ అక్టోబర్ 9న ఫలితాలు ప్రకటించనుంది. 

హెచ్‌‌ఎస్‌‌బీసీ సర్వీసెస్‌‌ పీఎంఐ, కాంపోజిట్ పీఎంఐ, అలాగే బ్యాంకింగ్ రంగంలో లోన్, డిపాజిట్ వృద్ధి డేటా కూడా మార్కెట్‌‌ కదలికలపై ప్రభావం చూపుతాయి.  ప్రైమరీ మార్కెట్‌‌లో టాటా క్యాపిటల్, ఎల్‌‌జీ ఎలక్ట్రానిక్స్  వంటి పెద్ద ఐపీఓలు కూడా లైన్‌‌లో ఉన్నాయి” అని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్  అజిత్ మిశ్రా వివరించారు. 

అమెరికా ప్రభుత్వ షట్‌‌డౌన్ నేపథ్యంలో  యూఎస్ ఫెడ్ మినిట్స్, జాబ్‌‌లెస్ క్లెయిమ్స్, కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా వంటి అంశాలపై మార్కెట్ ఫోకస్ ఉంటుంది.   రూపాయి–డాలర్ మారకం విలువను గమనించాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. గత వారం సెన్సెక్స్ 780.71 పాయింట్లు (0.97శాతం) పెరగగా,  నిఫ్టీ 239.55 పాయింట్లు (0.97శాతం) లాభపడింది.