పంట బీమాకు146 కోట్లు విడుదల

పంట బీమాకు146 కోట్లు విడుదల
  • జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

 హైదరాబాద్, వెలుగు: ఫసల్‌ బీమాకు సంబంధించి రూ.146.32 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. 2018–19లో బీమా సంస్థకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించక పోవడంతో రైతులకు అందాల్సిన పరిహారం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం నిధులను సర్కారు విడుదల చేసింది. 2018–19లో రెండు సీజన్‌లకు కలిపి 7.99 లక్షల మంది రైతులు రూ.155.99 కోట్లు ప్రీమియం చెల్లించి పంట బీమా చేసుకున్నారు. మొత్తం రూ.545.55 కోట్లు ప్రీమియం రూపంలో బీమా సంస్థలకు చెల్లించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద రూ.389.56 కోట్లు ఇవ్వాల్సి ఉంది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.194.78 కోట్లను చెల్లించలేదు. దీంతో ఆ యేడు పంట నష్టంపై రిపోర్ట్‌ చేసిన క్లెయిమ్‌లు రూ.587.31కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం 58 వేల మంది రైతులకు రూ.148.90 కోట్లు మాత్రమే అందాయి. ఇంకా రూ.438.41 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. ఈ యేడు కేటాయించిన బడ్జెట్‌లో రూ.146.32 కోట్లను చెల్లిస్తూ బుధవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 2018–19లో నిలిచిపోయిన బీమా క్లెయిమ్​లు పరిష్కారం కానున్నాయి.