- నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఏడు మున్సిపాలిటీలకు 1563 నామినేషన్లు
- అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్లో 1005, కామారెడ్డిలో 523 నామినేషన్లు
- నేడు పరిశీలన
నిజామాబాద్/కామారెడ్డి/ఆర్మూర్/బోధన్, వెలుగు : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో చివరి రోజు శుక్రవారం నామినేషన్ల జోరు సాగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, బలం, బలగంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లు సమర్పించారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ సెంటర్లోకి వచ్చినవారినే అధికారులు అనుమతించి టోకెన్లు ఇచ్చారు. అధికంగా నిజామాబాద్కార్పొరేషన్లో 1005 నామినేషన్లు దాఖలు కాగా, కామారెడ్డి మున్సిపాలిటీకి 523 నామినేషన్లు వచ్చాయి.
ఆర్మూర్ లో 179 నామినేషన్లు..
ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 179 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ తరఫున67, బీజేపీ 44, బీఆర్ఎస్ 42, ఇండిపెండెంట్ 9, ఎంఐఎం 4, ఆమ్ ఆద్మీ 4, బీఎస్పీ 3, జనసేన 2, ఎంబీటీ 1, సీపీఎం 1 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ఓపెన్ టాప్ జీపులో భారీ ర్యాలీతో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులతో నామినేషన్ కేంద్రానికి వచ్చి నామినేషన్స్ వేయించారు.
మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులతో నామినేషన్ కేంద్రానికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్హెచ్ వో సత్యనారాయణగౌడ్ సిబ్బందితో కలిసి నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించారు.
బోధన్‌లో చివరి రోజు 270 నామినేషన్లు..
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగింది. కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు డప్పువాయిద్యాలతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. శుక్రవారం ఒక్కరోజు 270 నామినేషన్లు వేశారు. బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా, 342 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందులో కాంగ్రెస్ -112, ఎంఐఎం-62, బీఆర్ఎస్ -90, బీజేపీ-43, స్వతంత్ర అభ్యర్థులు-19, ఆఫ్ పార్టీ- 2, బీఎస్పీ- 4, సీపీఎం-2, ఇతరులు -8 పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీపోటీగా నామినేషన్లు వేశారు. బోధన్ పట్టణంలోని గోశాల రోడ్డులోని 27వ వార్డు నుంచి మైనార్టీ మహిళ ఆసీయాబేగం బీజేపీ తరఫున నామినేషన్ వేశారు.
భీంగల్‌లో 113 నామినేషన్లు..
భీంగల్ మున్సిపాలిటీలోని 12 వార్డులకుగాను మొదటి రోజు 4, రెండో రోజు 25, చివరి రోజు శుక్రవారం 84 కలిపి 113 నామినేషన్లు వచ్చాయి. వాటిలో కాంగ్రెస్ తరపున 39, బీజేపీ నుంచి 28, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా 27, బీఎస్పీ పక్షాన 5 ఇతర రిజిస్టర్ పార్టీల నుంచి 4, ఇండిపెండెంట్లుగా 10 నామినేషన్లు వచ్చాయి.
కామారెడ్డిలో 523 నామినేషన్లు..
కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులకుగాను, 523 నామినేషన్లు వచ్చాయి. ఫస్ట్ డే బుధవారం 14 నామినేషన్లు రాగా, గురువారం 203, చివరి రోజు శుక్రవారం 306 నామినేషన్లు వచ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు, ఇండిపెండెంట్లు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేశారు. సీపీఎం, జనసేన, రాజ్యాధికార పార్టీ తరఫున కొన్ని వార్డుల్లో నామినేషన్లు వేశారు.
బాన్సువాడలో 250 నామినేషన్లు..
బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులకుగాను, 250 నామినేషన్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున 141, బీఆర్ఎస్ 60, బీజేపీ 33, ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 15 మంది నామినేసన్లు వేశారు. అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ తరఫున ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి.
బిచ్కుందలో 140 నామినేషన్లు..
బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులకుగాను 140 నామినేషన్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున 41, బీఆర్ఎస్ 35, బీజేపీ 23, బీఎస్పీ 2, ఎంఐఎం 1, రికగ్నైజ్డ్ పార్టీలు 3, ఇండిపెండెంట్లు 35 నామినేషన్లు వచ్చాయి.
ఎల్లారెడ్డిలో 88 నామినేషన్లు..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులకుగాను 88 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధ, గురు వారాల్లో 26 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు శుక్రవారం 62 నామినేషన్లు దాఖలయ్యాయి.
నిజామాబాద్ కార్పొరేషన్ కు 1,005 నామినేషన్లు
నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లకుగాను ఆఖరు రోజు శుక్రవారం నామినేషన్ల వరద కొనసాగింది. ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులు తమ మద్దతుదారులతో తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల్లోపు నామినేషన్ సెంటర్లలోకి ప్రవేశించిన వారికి టోకెన్లు ఇచ్చి గేట్లు క్లోజ్ చేశారు. తరువాత వారి నుంచి నామినేషన్లు స్వీకరించారు. తొలి రోజు 14 నామినేషన్లు రాగా, రెండో రోజు 228 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు 763 నామినేషన్లు వచ్చినట్లు కమిషనర్ దిలీప్కుమార్ తెలిపారు.
