- 20 మంది సర్పంచ్ లు ఏకగ్రీవం
కరీంనగర్, వెలుగు: మొదటి దశ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులెవరో తేలిపోయింది. వారికి గుర్తుల కేటాయింపు కూడా జరగడంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మొదటి దశలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో 20 స్థానాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికవగా.. 378 గ్రామాల్లో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి.
కరీంనగర్ జిల్లాలో 75 నామినేషన్ల విత్ డ్రా..
కరీంనగర్ జిల్లాలో మొదటి దశలో ఎన్నికలు జరిగే చొప్పదండి, గంగాధర, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు మండలాల్లోని 92 గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి 463 మంది నామినేషన్లు వేశారు. వారిలో 75 మంది అభ్యర్థులు బుధవారం తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చొప్పదండి మండలం దేశాయిపేట, పెద్దకురుమపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామడుగు మండలం శ్రీరాములపల్లె గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. మూడు ఏకగ్రీవ గ్రామాలు పోనూ మిగతా 89 గ్రామాల్లో 385 మంది బరిలో నిలిచారు.
రెండో దశలో ఎన్నికలు జరిగే 113 గ్రామాల్లో మొత్తం 888 నామినేషన్లు రాగా.. వీటిలో స్క్రూటీని అనంతరం 566 మంది నామినేషన్లకు ఆర్వోలు ఆమోదం తెలిపారు. 322 నామినేషన్లను రిజెక్ట్ చేశారు. అలాగే 1,046 వార్డు స్థానాల్లో 3,056 నామినేషన్లు రాగా 2,682 మంది నామినేషన్లకు ఆమోదం తెలిపి 374 నామినేషన్లను రిజెక్ట్ చేశారు. రెండో దశ ఎన్నికలు జరిగే జీపీల్లో శనివారం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
పెద్దపల్లి జిల్లాలో 99 గ్రామాల్లో 376 మంది..
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మొదటి దశలో ఎన్నికలు జరిగే మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలాల పరిధిలోని 99 గ్రామాల్లో ఇప్పటికే 4 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగతా 95 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ గ్రామాల్లో మొత్తం 376 మంది బరిలో నిలిచారు. అలాగే 896 వార్డులకు గానూ 211 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 685 వార్డులకు పోటీలో 1,880 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
జగిత్యాలలో 118 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో మొదటి దశ ఎన్నికలు జరిగే 122 జీపీల్లో నాలుగు గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 118 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఈ 118 స్థానాల కోసం మొత్తం 461 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 1172 వార్డు మెంబర్లలో 349 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగతా వార్డుల్లో 1952 మంది బరిలో ఉన్నారు.
