
- గ్రేటర్ వరంగల్ గణేశ్ నిమజ్జనాల్లో పోలీసుల నిఘా
- డ్యూటీలో నలుగురు డీసీపీలు, ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 15 మంది ఏసీపీలు
- కమిషనరేట్ 3 జోన్ల పరిధిలో 2,100 మంది పోలీసులతో బందోబస్తు
- నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు
వరంగల్, వెలుగు : గణేశ్ నిమజ్జనానికి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ ట్రైసిటీలో ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన పాయింట్ల వద్దకు తీసుకెళ్లేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోగా, పెద్ద సైజ్ గణనాథులను మాత్రం కాళేశ్వరం, భద్రాచలంలో నిమజ్జనం చేసేందుకు తెల్లవారు జామునుంచే శోభాయాత్ర మొదలు పెట్టారు. నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేలా పోలీస్ అధికారులు ఫోకస్పెట్టారు.
ఆరుగురు డీసీపీలు.. 2100 మంది పోలీస్ సిబ్బంది..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 3 జోన్లలో 6,683 వినాయక మండపాలు ఉన్నాయి. సెంట్రల్ జోన్ పరిధిలో 2,675, ఈస్ట్జోన్లో 2,043, వెస్ట్ జోన్‍లో 1,945 విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. 6,354 మండపాలను జియో ట్యాగింగ్ చేశారు. అయితే గ్రేటర్ సిటీలో ఆలయాలు, అపార్ట్మెంట్లలో మరో 1200 నుంచి 1500 విగ్రహాలు ప్రతిష్టించారు. గణపతి నిమజ్జన డ్యూటీల కోసం నలుగురు డీసీపీలు, ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 53 మంది సీఐలు, 70 మంది ఎస్సైలతోపాటు ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తంగా 2100 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‍ప్రీత్‍సింగ్ తెలిపారు.
సీసీ కెమెరాలు, డ్రోన్లతో..
ప్రధాన చెరువులు, సిటీ అవతల ఉండే చిన్న చెరువుల్లో కలిపి మొత్తంగా 24 ప్రాంతాల్లో గణేశ్నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. 24 క్రేన్లతోపాటు పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేసే వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో మరో 2 భారీ క్రేన్లు అందుబాటులో ఉంచుతున్నారు. శోభాయాత్ర జరిగే జంక్షన్లు, సెంటర్లతోపాటు నిమజ్జన ప్రాంతాలైన ట్రై సిటీలో ప్రధానంగా హనుమకొండ పద్మాక్షి టెంపుల్ సిద్ధేశ్వర గుండం, వరంగల్చిన్నవడ్డెపల్లి చెరువు, వరంగల్ కోట చెరువు, గీసుగొండ కట్ట మల్లన్న చెరువు, కరీమాబాద్ ఉర్సు గుట్ట రంగం చెరువు, మామూనూర్బెస్తం చెరువు, ఖిలా వరంగల్, అగర్తల చెరువు, మామూనూర్ పెద్ద చెరువు, కాజీపేట బంధం చెరువు, చల్లా చెరువు, గోపాల్పూర్ చెరువు, బీమారం చెరువు, హసన్పర్తి చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వినాయక శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు.
శాంతియుతంగా నిమజ్జనం చేయాలి..
శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జనం నిర్వహించేలా వరంగల్కమిషనర్ డీజేలపై ఆంక్షలు నిర్వహించారు. జనాలకు ఇబ్బంది కలిగించేలా పటాకులు కాల్చకూడదని, గొడవలు పడొద్దని సూచించారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ప్రధాన రహదారుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ట్రైసిటీ అంతటా ట్రాఫిక్ డైవర్షన్లు చేశారు. మద్యం మత్తులో గొడవలు జరగకుండా శుక్రవారం వైన్స్, బార్షాపులు బంద్ పెట్టారు. గురువారం సాయంత్రం వరంగల్ కలెక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ సన్‍ప్రీత్‍సింగ్, జీడబ్లూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‍పాయ్, మేయర్ గుండు సుధారాణితో కలిసి నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు.