ఇంట్లో చేసే రెసిపీ ఏదైనా బయటి వాటితో పోటీ పడలేదు. హోమ్ మేడ్ రుచే వేరు. ఐస్ క్రీమ్‌లోనూ అంతే.. ఫ్లేవర్స్ మారొచ్చు. కానీ ఫేవరేట్ మాత్రం హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అనేలా ఉంటాయి. బయటి ఫుడ్ అవాయిడ్ చేయడానికి, ఇంట్లో ఫుడ్ టేస్ట్‌కి అలవాటు పడడానికి ఇది బెస్ట్ ఐడియా. పైగా ప్రాసెస్ కూడా సింపుల్. సో... ఇక్కడున్న ఈ మూడు ఐస్ క్రీమ్‌లను కూడా మీ విష్‌లిస్ట్‌లో వేసుకోండి. ఇంట్లోనే తయారుచేసుకుని ఈ సమ్మర్లో చిల్ అవ్వండి.
కర్బూజతో..
కావాల్సినవి :కర్బూజ - ఒకటి
చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్
పాలు - ఒక కప్పు
విప్పింగ్ క్రీమ్ - ఒక కప్పు
తయారీ : కర్బూజ కట్ చేసి గింజలు తీసేసి, మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో చక్కెర వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం దగ్గరపడేవరకు ఉడికించాలి. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్ వేసి పాలు పోసి బాగా కలపాలి. ఆపై మిశ్రమం దగ్గరపడేవరకు ఉడికించాలి. ఒక గిన్నెలో విప్పింగ్ క్రీమ్ వేసి విస్కర్‌తో బీట్ చేయాలి. దాంట్లో అప్పటికే చల్లారిన కర్బూజ గుజ్జు, పాల మిశ్రమం వేసి మరోసారి అన్నీ కలిసేలా కలపాలి. కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పెట్టి పైన కవర్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. రాత్రంతా ఫ్రిజ్‌లో పెడితే, మరుసటి రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు.
అరటిపండుతో..
కావాల్సినవి :
పండిన అరటి పండ్లు - రెండు
పాలు - ఒక టీస్పూన్
డ్రైఫ్రూట్స్ - సరిపడా
తయారీ: అరటి పండ్ల ముక్కలను ఒక జిప్లాకర్ కవర్లో వేసి గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీజార్‌లో వేసి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆపై దాన్ని ఒక బాక్స్‌లో పెట్టి గాలిచొరబడకుండా మూతపెట్టి, ఫ్రిజ్‌లో పెట్టాలి. గంట తర్వాత తీసి, దానిపై డ్రైఫ్రూట్స్ చల్లుకుని తింటే టేస్టీగా ఉంటుంది.
కొబ్బరితో..
కావాల్సినవి :లేత కొబ్బరి - ఒక కప్పు
క్రీమ్ - ఒక కప్పు
చక్కెర పొడి - మూడు టేబుల్ స్పూన్లు
పాలు - అర కప్పు
తయారీ :ఒక గిన్నెలో క్రీమ్ వేసి దాన్ని విస్కర్‌తో బాగా కలపాలి. తర్వాత అందులో చక్కెర పొడి వేసి మరోసారి కలపాలి. పాలు, సన్నగా తరిగిన కొబ్బరి వేయాలి. ఆ మిశ్రమాన్ని వేసి మూతపెట్టి, దాదాపు ఏడు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత తీసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
