ఆవు కడుపులో 30 కిలోల ప్లాస్టిక్‌..ఇంకొన్ని రోజులే ఆగితే ..

ఆవు కడుపులో 30 కిలోల ప్లాస్టిక్‌..ఇంకొన్ని రోజులే ఆగితే ..

ఒడిశాలోని బెర్హంపూర్‌లోని ప్రభుత్వ పశువైద్యశాల వైద్యులు ఆవు కడుపులో నుంచి దాదాపు 30 కిలోల బరువున్న ప్లాస్టిక్ సంచులను తొలగించారు. సత్య నారాయణ్‌కర్‌ నేతృత్వంలోని వెటర్నరీ వైద్యుల బృందం నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి పదేళ్ల ఆవు కడుపులోంచి జీర్ణం కాని పాలిథిన్ సంచులను తొలగించింది. ఆగస్టు 2న జరిగిన ఈ విషయాన్ని గంజాం ముఖ్య జిల్లా పశువైద్యాధికారి మనోజ్ కుమార్ సాహు తెలిపారు.

ప్రజలు బయట పారేసిన పాలిథిన్ సంచులను తినడంతో ఆవు కడుపు నిండా ప్లాస్టిక్‌తో నిండిపోయింది. దాని వల్ల ఆవు పేగులు కూడా ప్రభావితమయ్యాయి. ఎక్కువసేపు పట్టించుకోకుండా ఉంటే ఆవు చనిపోయేదని వైద్యులు తెలిపారు. ఆవు పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, ఒక వారం పాటు ఆసుపత్రిలో ఉంటుందని చెప్పారు.

ALSO READ:108 అంబులెన్స్ ‌‌లు ప్రారంభం: గొంగిడి సునీత

గతేడాది కూడా ఆస్పత్రి వైద్యులు ఇదే తరహాలో ఓ ఆవు నుంచి 15 కిలోల ప్లాస్టిక్ ను తొలగించారు. ప్లాస్టిక్ వాడకం, రవాణా, తయారీపై ప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించినప్పటికీ, ప్లాస్టిక్ కాలుష్యం తీవ్రతను ఈ సంఘటన ఎత్తిచూపుతోంది" అని ఆర్యభట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుధీర్ రౌత్ అన్నారు. "నిషేధాన్ని సరిగ్గా అమలు చేయాలని మేము బెర్హంపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం" అని రౌత్ చెప్పారు. ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి ఈయన నాయకత్వం వహిస్తున్నారు.