వరదలతో పాక్​ ప్రజల అవస్థలు

వరదలతో పాక్​ ప్రజల అవస్థలు
  • 1.6 కోట్ల మంది పిల్లలకు తిండి దొరకట్లే
  • వరదలతో పాక్​ ప్రజల అవస్థలు.. సాయం కోసం ఎదురుచూపులు: యూఎన్
  • రక్తహీనతతో బాధపడుతున్న పిల్లల తల్లులు
  • బిడ్డలకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నరని వెల్లడి

ఇస్లామాబాద్: ఇటీవలి వరదల ప్రభావంతో పాకిస్తాన్​లోని 1.6 కోట్ల మంది చిన్నారులకు తిండి దొరకట్లేదని, వారిలో 34 లక్షల మందికి అత్యవసర సాయం అవసరమని యునైటెడ్ నేషన్స్ పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందని, చాలామంది పిల్లలు డయేరియా, డెంగీ, చర్మసంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని యునిసెఫ్ ప్రతినిధి అబ్దుల్లా ఫాదిల్ తెలిపారు. సింధ్ లోని నీట మునిగిన ప్రాంతాలలో ఆయన పర్యటించారు. వరదల కారణంగా సింధ్​ ప్రావిన్స్​లో 528 మంది పిల్లలు చనిపోయారని చెప్పారు. ‘‘పిల్లల మరణాలు తప్పించదగ్గవే. చాలామంది చిన్నారులు కుటుంబ సభ్యులతో రోడ్డు పక్కన, మురికి నీళ్ల మధ్య బతుకుతున్నరు. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. వేల సంఖ్యలో స్కూళ్లు దెబ్బతిన్నాయి. నీటి సరఫరా వ్యవస్థ, హెల్త్ కేర్ నాశనమైనది. ఇప్పటికీ పిల్లలకు సాయం అందడంలేదు. 

చాలామంది పిల్ల తల్లులు రక్తహీనత, పోషకాహార లేమితో ఇబ్బంది పడుతున్నరు. కనీసం పిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నరు” అని అబ్దుల్లా తెలిపారు. లక్షల మంది ఇండ్లు కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలారని అన్నారు. ఇప్పుడు ఎండలు పెరుగుతున్నాయని, టెంపరేచర్​ 40 డిగ్రీలు దాటుతోందని వివరించారు. ఈ ఎండ నుంచి రక్షణ పొందడానికీ వారికి అవసరమైన బట్టలులేవని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఆ ప్రాంతాల్లో పాములు, దోమల బెడద ఉందన్నారు. వరద బాధితులకు యునిసెఫ్​ చేయగలిగిన సాయమంతా చేస్తోందని చెప్పారు.

జపాన్, కెనడా ఆర్థిక సాయం

వరదలకు అతలాకుతలమైన పాకిస్తాన్ కు జపాన్ రూ.56 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. అలాగే కెనడా ప్రభుత్వం కూడా రూ.24 కోట్ల సాయం ప్రకటించింది. 12 చారిటబుల్ సంస్థల ద్వారా నిధులు సేకరించామని, త్వరలో ఆ నిధులను పాక్ కు అందిస్తామని కెనడా తెలిపింది.