
- అసెంబ్లీ కోటాలో 6, గవర్నర్ కోటాలో ఒకటి ఖాళీ
- పదవుల కోసం టీఆర్ఎస్ లీడర్ల ముమ్మర ప్రయత్నాలు
- వచ్చే నెలలో అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్
హైదరాబాద్, వెలుగు: త్వరలో ఖాళీకానున్న 7 ఎమ్మెల్సీ స్థానాలకు 47 మంది టీఆర్ఎస్ లీడర్లు పోటీ పడుతున్నారు. వీరిలో రిటైర్ కానున్న ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఉద్యమ లీడర్లు, ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా టీఆర్ఎస్ చేరిన నేతలు ఉన్నారు. వీళ్లంతా సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.అసెంబ్లీ కోటాలోని ఎమ్మెల్సీలు ఆకుల లలిత, ఫరీదుద్దీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం జూన్లో ముగియనుంది. అసెంబ్లీ కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు మే రెండోవారంలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసే చాన్స్ ఉంది.
మళ్లీ చాన్స్ కోసం
పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీలు మళ్లీ పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్సీగా చేసి చైర్మన్ గా కొనసాగించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉండగా.. గుత్తా మాత్రం తనను కేబినెట్లోకి తీసుకోవాలని కోరుతున్నట్టు ప్రచారంలో ఉంది. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, సాధ్యం కాకపోతే వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఆకుల లలిత తనకు మళ్లీ పదవి ఇస్తారని ధీమాతో ఉన్నారు. నేతి విద్యాసాగర్ రావు మండలి ఏర్పాటు (2007) నుంచి వరుసగా 14 ఏండ్లుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈసారి ఆయనకు చాన్స్ తక్కువే అని టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. ఆయన మాత్రం ధీమాతో ఉన్నారు. తమకు మరోసారి అవకాశం దక్కుతుందని ఫరీదుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి నమ్ముతున్నారు.
కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు
అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు వచ్చేలోపు సీఎంను కలిసి ఎమ్మెల్సీ పదవి అడిగేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రోజూ ప్రగతిభవన్ వర్గాలకు ఫోన్ చేసి సీఎం అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నారు. ఎవరిని ఎమ్మెల్సీగా చేయాలనే దానిపై కేసీఆర్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్లలో ఎక్కువ మందికి అదృష్టం వరించవచ్చని అంటున్నారు.
పదవి ఆశిస్తున్న వారు ఉమ్మడి జిల్లాల వారీగా..
వరంగల్: కడియం శ్రీహరి, శ్రీనివాస్రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, మధుసూదనాచారి, తక్కిలపల్లి రవీందర్ రావు, గుడిమల్ల రవీందర్, సీతారాం నాయక్, గుండు సుధారాణి.
ఖమ్మం: వద్దిరాజు రవిచంద్ర, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జలగం వెంకట్రావు, పిడమర్తి రవి, బొమ్మర రామ్మూర్తి, దుండిగల్ల రాజేందర్.
మెదక్: ఆర్.సత్యనారాయణ, ఫరీదుద్దీన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, చాగళ్ల నరేంద్రనాథ్, బాలమల్లు, దేవి ప్రసాద్, దేశపతి శ్రీనివాస్.
నల్గొండ: గుత్తా సుఖేందర్రెడ్డి, చాడ కిషన్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, నేతి విద్యాసాగర్, సామ భరత్ కుమార్.
ఆదిలాబాద్: బోడ నగేశ్, నల్లాల ఓదేలు, రేణికుంట్ల ప్రవీణ్, గడ్డం అరవింద్ రెడ్డి.
రంగారెడ్డి: క్యామ మల్లేశం, శుభప్రద పటేల్, బండారు లక్ష్మారెడ్డి.
నిజామాబాద్: ఆకుల లలిత, ఏనుగు రవీందర్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు.
కరీంనగర్: తుల ఉమ, సంతోశ్కుమార్, ఆరెపల్లి మోహన్, ప్రవీణ్ రెడ్డి, ఎడవెల్లి విజయేందర్ రెడ్డి.
హైదరాబాద్: తాడూరి శ్రీనివాస్, గట్టు రామచందర్, బొంతు రామ్మోహన్, పీఎల్ శ్రీనివాస్, శ్రవణ్రెడ్డి.