
కౌడిపల్లి, వెలుగు: జిల్లా వ్యాప్తంగా 498 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కౌడిపల్లి మండలం వెల్మకన్నెలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే100 కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం వస్తోందన్నారు. రైతులకు టోకెన్లు ఇచ్చి కొనుగోలు చేస్తామని తెలిపారు.
మరో వారం రోజుల్లో అన్ని మండలాల్లో వడ్ల కొనుగోళ్లు చేపట్టి, వెనువెంటనే రైస్ మిల్లులకు తరలిస్తామని పేర్కొన్నారు. వడ్లు తడిసి మొలకెత్తకుండా రైతులు తప్పనిసరిగా టార్పాలిన్లు వాడాలని సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలకు వెళ్లి, విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులతో లెక్కలు చేయించడంతోపాటు ఇంగ్లిష్ చదివించారు.
ప్రతీ విద్యార్థి టేబుల్స్ రాయడం, చదవడం, ఇంగ్లిష్ చదివేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, పిల్లలకు నిల్వ ఉంచిన ఆహారం కాకుండా ఎప్పటికప్పుడు వండి పెట్టాలని చెప్పారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఫైనాన్షియల్‌గా లబ్ధిదారులకు ఇబ్బందులుంటే వారికి లోన్సదుపాయం కల్పించి, ఇల్లు త్వరగా నిర్మించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్, జపీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తదితరులున్నారు