క్యాబ్ డ్రైవర్ నుంచి డ్రగ్స్ పట్టివేత

క్యాబ్ డ్రైవర్ నుంచి డ్రగ్స్ పట్టివేత

మేడ్చల్ జిల్లా: డ్రగ్స్ రాకెట్ పై పోలీసులు వరుస దాడులు చేపట్టారు. డ్రగ్స్ తో పట్టుపడిన వారిని అదుపులోకి తీసుకుని మీకు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీసి.. వారికి డ్రగ్స్ ఇచ్చిన వారి వివరాలు తెలుసుకుని అక్కడ కూడా దాడులు చేసి సరఫరా దారులను నిర్బంధంలోకి తీసుకున్నారు. తొలుత మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. శనివారం ముగ్గురు యువకులు కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

రహస్య సమాచారం మేరకు కూకట్ పల్లిలోని క్యాబ్ డ్రైవర్ పవన్ అనే వ్యక్తి వద్ద మెఫెడ్రోన్ డ్రగ్ ఉందని సమాచారం అందడంతో అతడిని పట్టుకోగా నాలుగు గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్ లభించింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించి ఎక్కడి నుండి వచ్చిందని ఆరా తీశారు. మేడ్చల్ లోని కన్నా మహేశ్వర రెడ్డి వద్ద నుండి తెచ్చుకున్నట్లు తెలపడంతో అక్కడ దాడులు చేయగా 926 గ్రాముల మెఫెడ్రోన్ లభించింది. మహేశరరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నాగర్ కర్నూల్ నుంచి రామకృష్ణ గౌడ్ సరఫరా చేసినట్లు తెలపగా అక్కడకు వెళ్లి దాడులు నిర్వహించగా రామకృష్ణ గౌడ్ వద్ద కారులో 4 కేజీల మెఫెడ్రోన్ దొరికింది. వీరికి సరఫరా చేసిన ప్రధాన నిందితులు ఎస్.కె. రెడ్డి, హన్మంత్ రెడ్డి పరారీలో ఉన్నారని ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య మీడియాకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ సుమారు రూ. రెండు కోట్లు ఉంటుందని పోలీసుల అంచనా వేశారు. నిందితుల వద్ద డ్రగ్స్ తో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య తెలిపారు.