కాలికి జీపీఎస్ ట్రాకర్, కెమెరాతో అనుమానస్పదంగా ఓ గద్ద భద్రాద్రి జిల్లాలో తిరగడం కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కాలికి జిపిఎస్ ట్రాకర్ ఉన్న ఒక గద్ద సంచారం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడి నుంచో చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం గుట్ట ప్రాంతానికి వచ్చిన గద్ద చాలాసేపు అక్కడే కూర్చుండి పోయింది. గద్ద అలసిపోవడం గమనించిన స్థానికులు కోడి మాంసాన్ని వేసి దాన్ని కట్టేశారు.
ఆకలితో ఉన్న గద్ద కోడి మాంసాన్ని తిన్నది. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత వేరే ప్రాంతానికి ఎగిరిపోయింది. అక్కడ ఉన్న స్థానికులు గద్ద ఫోటోలను వీడియోలను తీశారు. ఆ గద్ద కాళ్లకు జిపిఎస్ ట్రాకర్ తో పాటు కెమెరా కూడా ఉండటం స్థానికుల్లో చర్చనీయాంశం అయింది. ఈ గద్ద ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి పోలీసులను వివరణ అడగగా సమాచారం అందలేదని వారు తెలిపారు. గద్ద ఫోటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.