అవినీతి ఆఫీసర్లపై ఫోకస్​

అవినీతి ఆఫీసర్లపై ఫోకస్​
  • ఉమ్మడి జిల్లాలో ఏడాదిలో 12 కేసులు నమోదు చేసిన ఏసీబీ 
  • రెండు రోజుల కింద లంచం తీసుకుంటూ పట్టుబడిన మెట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్​
  • పట్టుబడిన వారిలో రెవెన్యూ, పోలీస్‌, రిజిస్ట్రేషన్‌ సిబ్బందే అధికం 


మెట్‌పల్లి, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలో అవినీతి ఆఫీసర్లపై ఏసీబీ ఫోకస్‌ చేసింది. బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ అవినీతి ఆఫీసర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. గతేడాది జనవరి నుంచి ఇప్పటిదాకా లంచం తీసుకున్నవారిపై 12 కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్ట్ చేసింది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖల్లోనే అవినీతి ఎక్కువగా ఉన్నట్లు ఏసీబీ కేసుల నమోదు బట్టి తెలుస్తోంది.

నెల కింద మామిడి కర్ర రవాణాకు పర్మిషన్‌ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ డీఆర్‌‌వో పట్టుబడగా, తాజాగా మెట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌‌ మార్టిగేజ్‌ కోసం రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కాగా అవినీతిపై ఫిర్యాదు చేసేలా ఏసీబీ అవగాహన కల్పిస్తుండగా, లంచాలు తీసుకునే అధికారులపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు వస్తున్నారు. 

రిజిస్ట్రేషన్ ​ఆఫీసుల్లో వసూళ్ల దందా 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 సబ్‌ రిజిస్ట్రార్​ఆఫీసులు ఉన్నాయి. ఏడాదికి ఒక్కో ఆఫీసులో 6 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. దీంతో కొందరు ఆఫీసర్లు, సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లు కుమ్మక్కై వసూళ్లకు తెరతీశారు. ప్రతిపనికి రేట్‌ ఫిక్స్‌ చేస్తూ దందా సాగిస్తున్నారు. ప్రాపర్టీ వ్యాల్యూను బట్టి రూ.2 వేల నుంచి రూ.లక్షల వరకు వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ల తయారీ, ప్రభుత్వ ఫీజుతోపాటు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇవ్వాల్సిన మామూళ్లు ముట్టజెప్పాల్సిందే.

ఈ దందాలో డాక్యుమెంట్ రైటర్లు కీలకంగా వ్యవరిస్తున్నారు. అన్ని సరిగా ఉన్నా పైసలు ఇవ్వాల్సిందే. ఇక రెండు రోజుల కింద ల్యాండ్‌ మార్ట్​గేజ్‌ చేసేందుకు మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్‌‌ ఆసిఫుద్దీన్‌, డాక్యుమెంట్‌ రైటర్‌‌ రవి, ఆఫీస్​ సబార్డినేట్‌ రవి కలిసి రూ.5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

గత జనవరి నుంచి 12 కేసుల్లో 20 మంది అరెస్ట్​

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2024 జనవరి నుంచి 2025 జనవరి 15 వరకు 12 ఏసీబీ కేసులు నమోదు కాగా 20 మందిని అరెస్టు చేశారు. 
 

2024 మార్చి 12న జమ్మికుంట జాయింట్ సబ్ రిజిస్ట్రార్ నాగవల్లి రజినీ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

అదే ఏడాది ఏప్రిల్ 24న గంగాధర సబ్ రిజిస్ట్రార్ శివారపు సురేశ్‌బాబు, సబార్డినేట్ కొత్తకొండ శ్రీధర్ రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏప్రిల్‌ 29న లో బీర్పూర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ రూ.ఐదు వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. 

మే 20న రాజన్నసిరిసిల్ల జిల్లాలో పీఆర్‌‌ ఇంజినీర్, సీనియర్ అసిస్టెంట్ జోగినిపల్లి భాస్కర్ రావు రూ. 7 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

జూన్ 21న రాయికల్ ఎస్సై అజయ్, మరొకరు పుల్లూరి రాజు రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. 

జులై 4న కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్ రేగులపతి వెంకటేశ్వర్, క్యాషియర్ సుధగొని కుమారస్వామి రూ. లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఆగస్ట్‌ 3న కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్‌‌ జాహెద్ పాషా, ప్రైవేటు అసిస్టెంట్ దాసరి ధర్మేంద్ర , డ్రైవర్ మహమ్మద్  అంజాద్ పట్టుబడ్డారు.

డిసెంబర్ 16న మామిడి కర్రను తరలించడానికి పర్మిట్ కోసం రూ. 4,500 లంచం తీసుకుంటూ జగిత్యాల డీఆర్‌‌వో హఫీజొద్దీన్ పట్టుబడ్డారు. 

అవినీతి చేస్తే  ఎంతటివారినైనా వదిలిపెట్టం

ప్రభుత్వ శాఖల్లో అవినీతి లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. జిల్లాలో వివిధ శాఖలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని శాఖలపై నిఘా ఏర్పాటు చేశాం. లంచాలు తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలు ఎవరికీ లంచాలు ఇవ్వొద్దు. డబ్బుల కోసం వేధిస్తే ఏసీబీకి సమాచారం ఇవ్వాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. - రమణమూర్తి,  ఏసీబీ డీఎస్పీ