వీకెండ్స్‌‌లో డ్రగ్స్​ టూర్లు .. రూటు మార్చిన అడిక్టర్స్​

వీకెండ్స్‌‌లో డ్రగ్స్​ టూర్లు ..  రూటు మార్చిన అడిక్టర్స్​

 

  •     పోలీసులకు అనుమానం రాకుండా గోవా, బెంగళూరు, ముంబై అడ్డాగా పార్టీలు
  •     వాట్సప్‌‌లో స్పెషల్ గ్రూప్స్‌‌,కోడ్స్‌‌తో డ్రగ్స్‌‌ ఆర్డర్ 
  •     పోలీసుల విచారణలో బయటపడుతున్న నిజాలు

హైదరాబాద్‌‌, వెలుగు: డ్రగ్స్‌‌ వాడకం కొత్త పుంతలు తొక్కుతోంది. హైదరాబాద్‌‌లో డ్రగ్స్‌‌ పెడ్లర్లు, కస్టమర్లపై పోలీసుల నిఘా పెరగడంతో వీకెండ్‌‌ డ్రగ్స్‌‌ టూర్స్‌‌ ప్లాన్‌‌ చేసుకుంటున్నారు. ఇందుకోసం టూరిస్ట్ ప్రాంతాలు గోవా, ముంబై, బెంగళూరు‌‌, వైజాగ్‌‌కు వెళ్తున్నారు. టూర్స్‌‌ కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. డ్రగ్స్‌‌ను ఆన్‌‌లైన్‌‌లో ఆర్డర్ చేసి కొరియర్‌‌‌‌లో తెప్పించుకుంటున్నారు. ఇలా ప్రతి టూర్‌‌‌‌ను సుమారు నాలుగు రోజుల వ్యవధితో ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో డ్రగ్స్‌‌పై పోలీసుల నిఘా తక్కువగా ఉండడంతో చైన్ సిస్టమ్‌‌తో టూర్స్‌‌ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల డ్రగ్స్‌‌ కేసుల్లో పట్టుబడిన పెడ్లర్లు, కస్టమర్లు పోలీస్ కౌన్సెలింగ్‌‌లో డ్రగ్స్‌‌ టూర్స్‌‌ గురించి వెల్లడించారు.

టూర్స్‌‌ కోసం వాట్సప్ గ్రూప్స్‌‌.. 

డ్రగ్స్ కేసుల్లో పెడ్లర్ల ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు కస్టమర్లను గుర్తిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకొని పేరెంట్స్‌‌ సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో పలువురు డ్రగ్స్ బానిసలు వీకెండ్‌‌ డ్రగ్స్ పార్టీల వివరాలను పోలీసులకు చెప్పారు. టూరిస్ట్ ప్రాంతాలను తమ అడ్డాలుగా చేసుకున్నట్లు వివరించారు. ఇందుకోసం ప్రత్యేక గ్రూప్స్‌‌ కూడా ఆపరేట్‌‌ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వివిధ రకాల కోడ్స్‌‌తో వాట్సప్‌‌ గ్రూప్స్‌‌ క్రియేట్‌‌ చేసుకొని, నమ్మకస్తులను మాత్రమే అందులో జాయిన్‌‌ చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. టూరిస్ట్‌‌ స్పాట్స్‌‌ పేరుతో డ్రగ్స్‌‌ ఆర్డర్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. రాష్ట్రంలో పోలీసుల నిఘా పెరగడంతో పాటు అరెస్టయితే పరువు పోతున్నదన్న కారణంగా వీకెండ్ డ్రగ్స్‌‌ టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారని విచారణలో తేలింది.

గోవా, బెంగళూరులో తక్కువ ధరకే డ్రగ్స్..

గోవా, బెంగళూరు‌‌, ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌‌లో డ్రగ్స్‌‌ వాడే వారి శాతం ఎక్కువగా ఉంది. ఏటా కస్టమర్ల సంఖ్య పెరుగుతుండటంతో డ్రగ్స్‌‌కి భారీ డిమాండ్‌‌ పెరిగింది. అదే క్రమంలో పోలీసులు, యాంటీ నార్కొటిక్స్‌‌ బ్యూరో కలిసి డ్రగ్స్ నెట్‌‌వర్క్‌‌పై నిఘా పెట్టింది. గతంలో డ్రగ్స్‌‌కు కేరాఫ్‌‌ అడ్రస్‌‌గా ఉన్న నైజీరియన్స్‌‌కు పోలీసులు చెక్‌‌ పెట్టారు. దీంతో బెంగళూరు‌‌, గోవా కేంద్రంగా కొకైన్‌‌, ఎండీఎంఏను నైజీరియన్స్ సప్లయ్ చేస్తున్నారు. వీరితో కాంటాక్ట్‌‌లో ఉన్న కస్టమర్లు సప్లయర్లుగా మారారు. సిటీలోని వివిధ కాలేజీల స్టూడెంట్స్‌‌కు, ఐటీ ఎంప్లాయీస్‌‌కి సప్లయ్ చేస్తున్నారు. 

డ్రగ్స్ ఆడిక్టర్స్ బాధితులు కాదు.. నిందితులు..

రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నివారణకు యాంటీ నార్కొటిక్స్‌‌ బ్యూరోతో పాటు లా అండ్ ఆర్డర్‌‌‌‌, టాస్క్‌‌ఫోర్స్, ఎస్‌‌ఓటీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టారు. డ్రగ్‌‌ సప్లయర్ల డేటా ఆధారంగా వారిపై నిఘా పెట్టారు. గతంలో డ్రగ్స్‌‌ కస్టమర్లను కేవలం బాధితులుగా మాత్రమే చూసేవారు. కానీ డ్రగ్స్‌‌కు డిమాండ్ తగ్గితేనే సప్లయ్‌‌ కూడా తగ్గుతుందని కస్టమర్లపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. డ్రగ్స్‌‌ తీసుకున్న వారిలో మార్పు తెచ్చేందుకు అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరుస్తున్నారు.  దీంతో కస్టమర్లు సిటీలో కంటే ఇతర రాష్ట్రాల్లో వీకెండ్‌‌ డ్రగ్స్ టూర్స్ పేరిట పార్టీలకు ప్లాన్‌‌ చేసుకుంటున్నారు.

  • క్రిష్‌‌‌‌కు యూరిన్ టెస్ట్‌‌‌‌లో నెగెటివ్‌‌‌‌
  • రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో పరీక్షలు

రాడిసన్ హోటల్‌‌‌‌ డ్రగ్స్  పార్టీ కేసులో సినీ డైరెక్టర్  జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్  క్రిష్ కు పోలీసులు శనివారం యూరిన్  టెస్టు చేయించారు. ఈ టెస్ట్‌‌‌‌లో అతనికి నెగిటివ్  వచ్చింది. అలాగే అతని బ్లడ్  శాంపిల్స్‌‌‌‌ రిపోర్ట్  కూడా సోమవారం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పరారీలో ఉన్న లిషిత, శ్వేత కోసం గాలిస్తున్నారు. విచారణకు సహకరించాల్సిందిగా నిందితుల కుటుంబ సభ్యులకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్  నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను ట్రేస్‌‌‌‌  చేస్తున్నారు. అలాగే  డ్రగ్స్  సప్లయర్లు మీర్జా వహీద్‌‌‌‌  బేగ్‌‌‌‌, అబ్దుల్‌‌‌‌ రహమాన్‌‌‌‌  గోవా నుంచి డ్రగ్స్  తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మీర్జా మహీద్‌‌‌‌.. రాడిసన్‌‌‌‌  హోటల్  డైరెక్టర్  వివేకానందకు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా డ్రగ్స్  సప్లయ్  చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. సయ్యద్  అబ్బాస్‌‌‌‌  అలీ జాఫ్రీ, వివేకానంద కారుడ్రైవర్  ప్రవీణ్‌‌‌‌  ద్వారా కొకైన్‌‌‌‌  డెలివరీ చేస్తున్నట్లు గుర్తించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా గోవా డ్రగ్స్  పెడ్లర్ల వివరాలు సేకరించారు. ఆయా డ్రగ్స్  సప్లయర్లతో కాంటాక్ట్‌‌‌‌లో ఉన్న కస్టమర్ల కోసం గాలిస్తున్నారు.