
గుడిహత్నూర్, వెలుగు: ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అశ్రద్ధ చేయవద్దని, వెంటనే ఆస్పత్రికి వెళ్లి సరైన వైద్యం చేయించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు సూచించారు. సామాజిక సేవకుడు గిత్తే మదన్ గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుమూల ఆదివాసీ, గిరిజన ప్రజల కోసం తన సొంత ఖర్చులతో వైద్య పరీక్షలు, రోగ నిర్దారణ పరీక్షలు, ఎక్స్‌రే, స్కానింగ్ వంటి సౌకర్యాలతో హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసిన గిత్తే మదన్ ను అభినందించారు.
దీర్ఘకాల సమస్యలు నయంకావడం కోసం కొందరు బాబాలు, మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారని ఇది మంచిది కాదన్నారు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. 1200 మందికిపైగా ప్రజలు హెల్త్ క్యాంప్‌కు హాజరయ్యారని మదన్ బృందం తెలిపింది. అడిషనల్ డీఎంహెచ్‌వో మనోహర్, తహసీల్దార్ కవితారెడ్డి, మెడికల్ ఆఫీసర్ శ్యాంసుందర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.