జూన్ లో బంగ్లాదేశ్ కు బహిష్కరించబడిన గర్బిణీ, ఆమె కొడుకును వెంటనే ఇండియాకు తీసుకువచ్చేందుకు కేంద్రం బుధవారం (డిసెంబర్3) అంగీకరించింది. సాంకేతిక అంశాలకంటే మానవత్వం ముఖ్యం అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత గర్భిణీ, ఆమె కొడుకును పశ్చిమ బెంగాల్ కు తీసుకువచ్చేందుకు ఒప్పుకుంది.
ఢిల్లీనుంచి బహిష్కరణకు గురైనా సునాలి ఆమె కొడుకును పశ్చిమబెంగాల్ లోని ఆమె కుటుంబం దగ్గర ఉండేందుకు అనుమతించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆమెకు తక్షణ వైద్య సాయం, ఆమె కొడుకుకు అన్ని రకాల సాయం అందించాలని సూచించింది. స్వదేశానికి తిరిగి పంపాలని కోరుకునే మరో నలుగురికి సంబంధించి సూచనలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.ఈ కేసు విచారణను డిసెంబర్ 12కి వాయిదా వేసింది.
దేశం నుంచి బంగ్లాదేశ్ కు ఆరుగురి బహిష్కరణకు సంబంధించి కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. బహిష్కరించిన వారిని తిరిగి ఇండియాకు రప్పించాలని, వారికి భారత సిటిజన్ షిప్ ను నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని సెప్టెంబర్ 26న కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలపై కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు..బహిష్కరించబడిన వారిలో ఉన్న ఢిల్లీకి చెందిన సునాలి, ఆమె మైనర్ కుమారుడు విషయంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. జూలైలో దేశం నుంచి బహిష్కరించబడిన ఆరుగురిలో సునాలి, ఆమె మైనర్ కుమారుడు, భర్త ఉన్నారు. ఢిల్లీ లోని రోహిణి ప్రాంతంలో వీరు నివసించారు. బహిష్కరణ సమయంలో సునాలి గర్భవతి.
డిసెంబర్ 1న విచారణ సందర్భంగా సునాలి నిండు గర్భిణీ అని తెలిసిన తర్వాత ఆమెను తాత్కాలికంగా భారత్ తిరిగి వచ్చే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. మానవతా దృక్పథంలో సూచనలను తీసుకొని బుధవారంనాటికి కోర్టుకు తెలపాలని ఆదేశించింది.
సునాలి ,ఆమె బిడ్డకు మానవతా సహాయానికి మాత్రమే ఉత్తర్వులు జారీ చేస్తున్నాం.. కేంద్రం చట్టపరమైన వాదనలకు ఇది ఎటువంటి అడ్డంకి కలిగించదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. మిగిలిన నలుగురు బహిష్కరణకు గురైనా వారి అంశాన్ని వచ్చే వారం పరిశీలిస్తామని డిసెంబర్ 12 కు విచారణ వాయిదా వేసింది.
