మళ్లీ చాలాచోట్ల వరి పంటే వేస్తున్న రైతులు

మళ్లీ చాలాచోట్ల వరి పంటే వేస్తున్న రైతులు

రాష్ట్రంలో పంటల మార్పిడిపై రచ్చ కంటిన్యూ అవుతోంది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను తప్పుపడుతున్నాయి విపక్షాలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అనేక మండలాల్లో వరి తప్ప మిగతా ఆరుతడి పండించలేని పరిస్థితి. దీంతో యాసంగిలో వరిసాగు వద్దని సర్కార్ చెబుతున్నా...  మళ్లీ చాలాచోట్ల వరి పంటే వేస్తున్నారు రైతులు. కొందరు వరికి బదులు ఆకు కూరలు, కూరగాయల సాగుకు ప్రయత్నిస్తున్నారు.  గతంలో నల్లగొండ జిల్లాలో బత్తాయి ఎక్కువగా పండేది. నీళ్ల సౌకర్యం పెరగడంతో బత్తాయి తోటలను తొలగించి వరి సాగు చేశారు రైతులు. ప్రభుత్వం పంటమార్పిడి ప్రచారం చేస్తుండటంతో .. ఇప్పుడు మళ్లీ పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. తీసేసిన బత్తాయి తోటల స్థానంలో కొత్త పండ్ల మొక్కలు నాటుతున్నారు. నర్సరీల్లో వెతికి మరి కొత్త మొక్కలను తీసుకొస్తున్నారు రైతులు. 

పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఎంతో కాలంగా ఆరుతడి పంటలు పండించిన రైతులను వరిసాగు వైపు మళ్లేలా చేసింది కేసీఆర్ సర్కారే అంటున్నారు. సరిపడ నీళ్లు, కరెంటు ఇవ్వడంతో వరిసాగు పెరిగిందని చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు పంట మార్పిడి అంటే వెంటనే సాధ్యమయ్యే పని కాదంటున్నారు.మార్కెటింగ్ సదుపాయం కల్పించకుండా పంటల మార్పిడిపై మాట్లాడటం సరికాదంటున్నారు. ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలంటున్నారు వ్యవసాయ నిపుణులు. మార్కెటింగ్ సదుపాయం కల్పించేలా ఏర్పాటు చేయాలంటున్నారు.