మహిళలకు ప్రభుత్వ చేయూత : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మహిళలకు ప్రభుత్వ చేయూత : మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు :  రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ తో కలిసి శుక్రవారం స్థానిక వెలుగుమట్ల అర్బన్ పార్క్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఆయన మాట్లాడారు. మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్లు అందించామని, రెండో సంవత్సరం ఇప్పటికే రూ.6 వేల కోట్లు మహిళలకు అందించినట్లు తెలిపారు.

 మహిళల రుణాల రికవరీ 99 శాతం, కొన్నిచోట్ల 100 శాతం ఉందన్నారు. జిల్లాలో 2 లక్షల మంది మహిళలు ఉంటే, స్వయం సహాయక సంఘాల్లో 40 వేల మంది మాత్రమే సభ్యులున్నారని, సంఘాల్లో నమోదు కాని వారందరూ వెంటనే నమోదు అవ్వాలని సూచించారు. రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసుకున్నామని తెలిపారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. నగర పరిధిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలంతో వెలుగుమట్ల అర్బన్ పార్క్ జిల్లాకు ఒక మంచి ఆస్తి అని అన్నారు. ఫెన్సింగ్ చేసి, జంతువుల తెచ్చి, పిల్లల ఆట వస్తువుల ఏర్పాటు చేసి విడుతలవారీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.  కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మహిళల సాధికారతకు ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని తెలిపారు.

 జిల్లాలో 9 వేలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉండి, రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉన్నామని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 2,700 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.  అనంతరం రఘునాథపాలెం మండలానికి సంబంధించి 934 సంఘాల్లోని 9,340 మంది సభ్యులకు రూ.1.18 కోట్లు, కేఎంసీ పరిధిలోని 2.958 సంఘాల్లోని 29,580 మంది సభ్యులకు రూ.2.81 కోట్లు, ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 3.99 కోట్ల వడ్డీ లేని రుణాలు, మరణించిన 15 మంది సభ్యులకు రూ. 11.76 లక్షలు లోన్ బీమా చెక్కులను, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్​ పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా 
జోహారా, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. 

పార్కులో పలు అభివృద్ధి పనుల ప్రారంభం.. 

వెలుగుమట్ల అర్బన్​ పార్కులో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఇందులో వాకింగ్ ట్రాకులు, సైక్లింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలాలు, థీమాటిక్ గార్డెన్లు, విశ్రాంతి మండపాలు, చైన్ లింక్ ఫెన్సింగ్, కార్తీక వన భోజనం డైనింగ్ హాల్, పార్క్ సందర్శకుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన భోజన హాల్, కమ్యూనిటీ కిచెన్, సామాజిక కార్యక్రమాల కోసం నూతనంగా నిర్మించిన వంటగది, అటవీ మంటలు, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు ట్రాక్టర్ విత్ వాటర్ టాంకర్, బ్యాటరీ ద్వారా నడిచే చెత్త తొలగింపు వాహనం, పార్క్ పరిసరాల్లో పరిశుభ్రత కోసం మున్సిపాలిటీ అందించిన ప్రత్యేక వాహనాలుఉన్నాయి. వన మహోత్సవంలో భాగంగా ‘ఒక మొక్క అమ్మ పేరు మీద’ అనే అంశంపై భారీ స్థాయిలో వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు.