మెహందీ, టాటూ ఉంటే నో ఎంట్రీ !

మెహందీ, టాటూ ఉంటే నో ఎంట్రీ !
  • మే 7 నుంచి 11 వరకు ఎప్ సెట్
  • అటెండ్ కానున్న 3.54 లక్షల మంది స్టూడెంట్లు 
  • వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులకూ నో పర్మిషన్​
  • ఆన్​లైన్​లో అగ్రికల్చర్ హాల్ టికెట్లు
  • మే 1 నుంచి ఇంజినీరింగ్ హాల్​టికెట్లు

హైదరాబాద్, వెలుగు: మే 7 నుంచి 11 వరకు జరగనున్న ఈఏపీసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)కు అన్ని ఏర్పాట్లు చేశామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు 3,54,803 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చెప్పారు. అందులో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ లో 1,00260 మంది, ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో 2,54,543 మంది ఉన్నారని చెప్పారు. పరీక్షకు అటెండ్ అయ్యే స్టూడెంట్ల చేతులకు మెహందీ పెట్టుకోవద్దని, టాటూలు వేసుకోవద్దని వారు సూచించారు. సోమవారం జేఎన్టీయూహెచ్​ లో ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్, వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావు, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్ తదితరులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. 

గతేడాది ఎంసెట్ కు 3.20 లక్షల మంది అప్లై చేసుకోగా..ఈ సారి ఆ సంఖ్య 3.54 లక్షలకు పెరిగిందని చెప్పారు. మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ స్టూడెంట్లకు ఎగ్జామ్స్ ఉంటాయని, వారి కోసం 135 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మే 9,10,11వ తేదీల్లో జరిగే ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు 166 సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. నిర్ణీత సమయానికి 90 నిమిషాల ముందు నుంచే సెంటర్ లోకి అనుమతిస్తామన్నారు. పరీక్ష కేంద్రంలోకి వాటర్ బాటిల్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని  చెప్పారు. ఎప్ సెట్ పరీక్షలు రాసే విద్యార్థులకు.. ఇతర సెంట్రల్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే తమను సంప్రదించాలని, అలాంటి వారికి వేరే షిఫ్ట్ లో పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. 

తొలిసారి బయోమెట్రిక్ తో పాటు ఫేస్ రికగ్నైజేషన్  విధానం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. సోమవారం నుంచి అగ్రికల్చర్ స్ట్రీమ్ స్టూడెంట్లు https://eapcet.tsche.ac.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఇంజినీరింగ్ స్ట్రీమ్ స్టూడెంట్లు మే1 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వారు తెలిపారు. మొత్తం 15 బోర్డుల నుంచి ఎప్ సెట్ కు అప్లై చేసుకోగా, దాంట్లో అత్యధికంగా తెలంగాణ ఇంటర్  విద్యార్థులు 2,72,145 ఉండగా, ఆ తర్వాత ఏపీ ఇంటర్ బోర్డు నుంచి 69 వేల మంది దరఖాస్తు చేశారు. అందరికీ అనుగుణమైన సిలబస్ తో పరీక్ష పెడుతున్నట్టు వారు చెప్పారు.