స్వగ్రామానికి తిరిగొచ్చిన ఆనందయ్య

స్వగ్రామానికి తిరిగొచ్చిన ఆనందయ్య
  • మందుల కోసం ఇప్పుడే ఎవరూ కృష్ణపట్నం రావొద్దు
  • మందుల తయారు చేయడం మొదలుపెడతా
  • కనీసం 3 లేదా 4 రోజులు పడుతుంది
  • మందుల పంపిణీ ప్రారంభిచేది అధికారికంగా ప్రకటిస్తా: ఆనందయ్య

నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య తన స్వగ్రామానికి తిరిగొచ్చాడు. మరో మూడు రోజుల్లో మందుల పంపిణీని ప్రారంభించేందుకు మందుల తయారీ మొదలుపెడతానని అంటున్నాడు. ఆనందయ్య మందులపై ఆయుష్, సీసీఆర్ఏఎస్ నివేదికపై స్పందించిన ప్రభుత్వం మందుల పంపిణీకి అంగీకరించిన విషయం తెలిసిందే. కంట్లో వేసే చుక్కల మందు మినహా మిగిలిన మందుల పంపిణీకి ఓకె చెప్పింది. ఒకవైపు తన మందులపై విచారణ జరుగుతున్న సమయంలో ఆనందయ్య గ్రామంలో ఉండకుండా వెళ్లిపోయారు. రహస్య ప్రదేశంలో ఉంటూ వచ్చారు. ప్రభుత్వం మందుల పంపిణీకి అంగీకరించిన విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆనందయ్యను వెంట పెట్టుకుని కృష్ణపట్నం వచ్చారు.

ఆనందయ్య గ్రామంలోకి వస్తున్న సందర్భంగా గ్రామస్తులు గుమ్మడికాయతో దిష్టి తీసి స్వాగతం పలికారు. ఆనందయ్య వచ్చిన విషయం తెలియడంతో మందు పంపిణీకి అనుమతి వచ్చిన సందర్భంగా ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ఆనందయ్య మీడియాతో మాట్లాడుతూ మందుల తయారీ ప్రారంభిస్తానన్నారు. అవసరమైన వన మూలికలు, పదార్థాలు సేకరించి పెద్ద ఎత్తున మందుల పంపిణీ మొదలు పెడతానన్నారు. మందుల తయారీకి కనీసం 3 రోజులు పడుతుందని ఆయన చెప్పారు. ఆయుష్ అధికారులతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం నుండి అధికారిక అనుమతి వచ్చిన వెంటనే మందుల పంపిణీని ప్రారంభిస్తానన్నారు. అధికారుల సూచన మేరకు మందు పంపిణీ మొదలుపెట్టే తేదీని ప్రకటిస్తానని చెప్పారు. ఆనందయ్య మందుల కోసం ఇప్పుడే ఎవరూ కృష్ణపట్నం రావొద్దని, కరోనా ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోరారు.