అమ్ముకునేందుకు భూములున్నాయి కానీ దళిత, గిరిజనులకు ఇవ్వడానికి లేవా?

అమ్ముకునేందుకు భూములున్నాయి కానీ దళిత, గిరిజనులకు ఇవ్వడానికి లేవా?

పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
మహబూబాబాద్:
రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముకునేందుకు భూములు ఉన్నాయి కానీ.. పేద దళిత, గిరిజనులకు ఇచ్చేందుకు లేవా..? అని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. శనివారం ఇందిరాభవన్ లో జరిగిన పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు జగన్ లాల్ నాయక్, జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ మనకు పోడు భూములకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మాత్రమేనన్నారు. కేసీఆర్ దళితులను సీఎం చేస్తా అని అన్నారు మోసం చేశారని ఆమె ఆరోపించారు. దళిత, గిరిజనుల హక్కులను తెలంగాణ లో కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగిందని, హరిత హారం పేరుతో కేసీఆర్ గిరిజనుల భూములు గుంజుకున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ లకు కాంగ్రెస్ పార్టీ హక్కులు, రిజర్వేషన్లు ఇచ్చి అండగా నిలిస్తే కేసీఆర్ కనీసం సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయడం లేదన్నారు. దళితులకు, గిరిజనులకు  ఇచ్చిన సంక్షేమ పథకాలను సబ్ ప్లాన్  కింద చూపించడం అన్యాయం అని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, రిజర్వేషన్లు ఇస్తామన్న కేసీఆర్ ఇప్పుడు పట్టించుకోలేదన్నారు. భూములు లేవు, ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్లు లేవు, రైతు బంధు, దళిత బంధు పథకాలు కేవలం ఎన్నికల హామీలే అని విమర్శించారు. సబ్ ప్లాన్  ప్రకారం నిధులు ఖర్చు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గిరిజన మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. 
ఇంద్రవెల్లి వేదికగా జరుగుతున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలి
9వ తేదీ క్విట్ ఇండియా దినోత్సవం, అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఆరోజు ఉద్యమాన్ని ప్రారంభించాలి, ఇంద్రవెల్లి వేదికగా జరుగుతున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్ సీతక్క పిలుపునిచ్చారు. ‘‘భూమి ఒక ఆత్మ గౌరవం.. భూమి మనకు కావాలి.. అమ్ముకోవడానికి భూములున్నాయి కానీ దళితులకు, గిరిజనులకు ఇవ్వడానికి భూములు లేవా..పోడు భూములు రక్షించుకుందాం..’’ అని సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమాలు చేసి పేదలకు న్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పోరాటాన్ని మరింత ఉదృతం చేసి మన హక్కులను సాధించుకుందామని సూచించారు.