- భీమన్నను దర్శించుకున్న 60 వేల మంది భక్తులు
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ భీమేశ్వర ఆలయం సోమవారం భక్తజనసంద్రంగా మారింది. శివనామస్మరణతో భీమన్న క్షేత్రం మార్మోగింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గత రాత్రి వేములవాడకు చేరుకున్న భక్తులు తెల్లవారుజామున నుంచే స్వామి వారి దర్శనం కోసం క్యూలెన్‌లో వేచి ఉండడంతో దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. కోరిన కోర్కెలు తీరాలని స్వామి వారికి కోడె మొక్కులు చెల్లించారు.
స్వామివారికి పంచమృతాలతో అభిషేకాలు నిర్వహించారు. గండా దీపంలో నూనె పోసి వేడుకున్నారు. నిత్య కల్యాణం, చండీహోమం, సత్యనారాయణ వ్రతాలు, లింగార్చనలు వంటి పూజకార్యక్రమాలలో భక్తులు పాల్గొన్నారు. భీమేశ్వర స్వామివారిని సుమారు 60 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ ఈవో రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

