జయలలిత మృతిపై విచారణ జరపాల్సిందే : అరుముగస్వామి కమిషన్

జయలలిత మృతిపై విచారణ జరపాల్సిందే : అరుముగస్వామి కమిషన్

తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని అరుముగస్వామి కమిషన్ తన రిపోర్టులో పేర్కొంది. జయలలిత మృతిపై అరుముగస్వామి కమిషన్ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.  వీకే శశికళ, కెఎస్‌ శివకుమార్‌, అప్పటి ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌, ఆరోగ్యమంత్రి విజయభాస్కర్‌ లను  విచారించాలని కమిషన్ రిపోర్టు ఇచ్చింది. జయలలిత 2016 డిసెంబర్ 5న రాత్రి 11.30కు చనిపోయిందని ఆస్పత్రి ప్రకటించింది కానీ తాము విచారించిన సాక్షుల కథనం ప్రకారం  డిసెంబర్ 4వ తేదీన 3గంటల నుంచి 3.50 గంటల మధ్య చనిపోయిందని  కమిషన్ అభిప్రాయపడింది.

జయలలిత మరణంపై అపోలో ఆస్పత్రి ఇచ్చిన స్టేట్మెంట్ సరిగ్గా లేదని కమిషన్ పేర్కొంది. జయలలితకు అద్భుతమైన వైద్యం అందించామని చెప్పడం తప్ప.. మరేటువంటి పత్రాలను హాస్పిటల్‌ సమర్పించలేదని వెల్లడించింది. జయలలిత గుండె జబ్బుల గురించి.. ఆమెకు అందిస్తున్న చికిత్స గురించి అపోలో చైర్మన్ ప్రతాప్‌ రెడ్డి వెల్లడించలేదని స్పష్టం చేసింది. 2012లో జయలలిత, శశికళ మళ్ళీ కలిసినా.. వారిద్దరి మధ్య సత్సంబంధాలు లేవని కమిషన్‌ అభిప్రాయపడింది.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక అనుమానాలున్నాయని ఆమె ముఖ్య అనుచరుడు, మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఆరోపించారు. నాడు సీఎంగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి..ఈ అనుమానాలను నిగ్గు తేల్చేందుకు సెప్టెంబరు 2017లో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆరుముగసామి కమిషన్ గత 5 సంవత్సరాలుగా పలు పార్టీలను విచారించింది. జయలలిత సహచరులు, బంధువులు, అధికారులు, మాజీ మంత్రులను విచారించింది. అటు కమిటీ పరిశీలించిన 75 మంది సాక్ష్యులలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు, అప్పట్లో విధులలో ఉన్న చెన్నై పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇలా 158 మందిని కమిషన్‌ విచారించింది.