విషాదం: పొగిడారేగాని ఎవరూ సాయం చేయలే

విషాదం: పొగిడారేగాని ఎవరూ సాయం చేయలే
  • భుజాలకెత్తుకుని రెండు ఆస్పత్రులకు మోసుకెళ్లినా దక్కని మామ 
  • కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన నిహారిక మామ తులేశ్వర్ దాస్(75)
  • మామను మోసుకెళ్లినందుకు కరోనా బారిన పడ్డ నిహారిక
  • తన మామతోపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిహారికా దాస్
  • అందరూ పొగిడారు.. ఫోటోలు తీసుకున్నారే తప్ప ఎవరూ సాయం చేలేదు
  • మామామ బతికుంటేబాగుండేదని కంటతడిపెట్టుకున్న నిహారికా దాస్

గువాహటి: ఆదర్శ కోడలు.. మానవత్వానికి ప్రతిరూపం.. ధీరత్వం అంటే నిహారికదే.. నిహారిక మనో నిబ్బరం భేష్ అంటూ హెడ్ లైన్లతో మీడియాలో ప్రసారం చేసి... కష్ట కాలంలో ఒకరికొకరు తోడుండాలి.. మానవత్వం ప్రదర్శించాలి తదితర ట్యా గ్ లైన్లతో  సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ.. నిహారికను వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్న వారందరికీ ఊహించని షాక్. నిహారికా దాస్ కష్టం వృధా అయింది. ఆమె మామ తులసీదాస్ కరోనాతో పోరాడలేక తుదిశ్వాస విడిచారు.
 వైద్య చికిత్స ఫలించకపోతే మనమేం చేయలేం.. కరెక్టే.. కానీ ఇంతలా ఆమెను ప్రపంచమంతా తెలిసేలా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారుగాని.. ఇరుగు పొరుగు వారు గానీ.. దగ్గరున్న వారు కానీ ఏ ఒక్కరూ ఆమెకు గాని.. ఆమె కుటుంబానికి గాని ఎలాంటి సాయం చేయలేదన్న విషయం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 
అందరూ వస్తున్నారు.. పొగుడుతున్నారు.. ఫోటోలు తీసుకుంటున్నారు గాని.. ఏ ఒక్కరూ సాయం చేయలేదంటూ.. ఆస్పత్రిలో నిహారికాదాస్ కంటతడిపెట్టుకుంది. అందరూ తనతో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఇంటర్వ్యూలు చేస్తుంటే పొంగిపోయి.. ఆ సంతోషాన్ని అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మామ తులేశ్వర్ దాసుకు చూపించుకుని సంబరపడిన నిహారికా దాస్ గుండెలవిసేలా విలపిస్తోంది. ‘నన్ను మోసేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అని ఆ పెద్దాయన చెప్పిన మాటలతో పొంగిపోయి ఆ విషయాన్ని అందరితో.. మీడియాతోనూ పంచుకుని నెమరు వేసుకుంటోంది. తన ఆనందం ఎంతోసేపు నిలవలేదంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆస్పత్రిలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పు చేసినట్లు ఆమె ముందు తలదించుకుంటున్నారు.
ఫోటోలు తీసుకుని షేర్ చేయడంతోపాటు.. అందరూ కలసి మెలసి ఉండాలని.. ఒకరినొకరు తోడుగా సాయం చేసుకోవాలనే సందేశం అందరూ ఇచ్చారు కానీ.. నాకే ఏ ఒక్కరూ సాయం అందించకపోవడం బాధగా ఉంది. నా కష్టం చూసి.. కష్ట సమయంలో నేను పడిన బాధలు చూసి ఫోటోలు తీశారే తప్ప సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మామను ఎత్తుకుని తీసుకెళ్తున్న ఫోటోలు,వీడియోలు చూపిస్తూ చెబుతున్న మాటలు చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. కష్టాల్లో  ఉన్న వారికి సహాయం చేయడం మనుషుల కర్తవ్యం.. అది నెరవేరనంత వరకు మానవత్వం గురించి, సహాయం గురించి ఎంత మాట్లాడుకున్నా వృధాయేనని కంటతడిపెట్టుకుంది నిహారికా దాస్. 
వైరల్ అవుతున్న నిహారికా దాస్ కథనాలు
అస్సాం రాష్ట్రంలోని నగోన్ నగర సమీపంలోని భాటీగాన్ గ్రామానికి చెందిన నిహారికా దాస్ (24)  భర్త జీవనం గడపడం కోసం పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి వెళ్లి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆరేళ్ల కొడుకు, మామ తులేశ్వర్ దాస్ లతో కలసి నిహారికా దాస్ జీవిస్తోంది. మామ తులేశ్వర్ దాస్(75) పోకవక్కలను అమ్ముకుని కుటుంబానికి తోడుగా నిలుస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇల్లు గడవడం కష్టం కావడంతో నిహారిక కూలీ పనులకు వెళుతోంది. 
ఈనెల 2వ తేదీన తులేశ్వర్ దాస్(75) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నిహారిక ప్రయత్నించగా ఎవరూ రాలేదు. ఇరుకైన గల్లీలో ఉన్న తమ ఇంటి వద్దకు ఆటో రాలేని పరిస్థితి గమనించి ఆమెనే స్వయంగా తన మామను భుజానికెత్తుకుని ఆటో వరకు తీసుకెళ్లింది. నాగావ్ హెల్త్ సెంటర్కు తన మామను భుజానికెత్తుకుని మోసుకెళ్తుంటే అందరూ ఆమెను తమ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీశారు. మామ తులేశ్వర్ తోపాటు  నిహారికకు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తులేశ్వర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అర్జంటుగా ఆస్పత్రిలో చేర్చాలని అక్కడి సిబ్బంది చెప్పారు. లాక్ డౌన్.. ఆమె మామ అనారోగ్యం చూసి ఆటోలు ఎవరూ రాలేదు. దీంతో ఓ మినీ వ్యాన్ మాట్లాడుకుని అక్కడికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడా కనీసం ఒక్క స్ట్రెచర్ కూడా లేదు. ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఇక్కడ కూడా ఆమె తన మామ తులేశ్వర్ ను భుజానికెత్తుకుని ఆస్పత్రిలోకి తీసుకెళ్లింది. అక్కడా ఎలాంటి పడకలు లేవని చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించడంతో.. చాలా సేపు అందరినీ బతిమాలుకుంటే ఏదో ఒక మూల పడక కేటాయించారు.

అయితే పరిస్థితి విషమించడంతో ఈనెల  5న గువాహటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. ఈలోగా ఆమె తన మామను భుజానికెత్తుకుని తీసుకెళ్తున్న ఫోటోలు, వీడియోలు సెలబ్రిటీలకు దీటుగా మీడియాలో.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే ఇంత కష్టపడినా ఆమెకు ఫలితం దక్కలేదు. ఆమె మామ తులేశ్వర్ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడువగా.. నిహారిక మాత్రం కరోనా నెగటివ్ వచ్చే వరకు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది.