వేడి వేడి అన్నంలో అప్పుడే నూరిన రోటి పచ్చడి వేసుకుని, కాస్త నెయ్యి కలుపుకుని తింటుంటే.. ఆ కమ్మదనానికి నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అయిపోతుంది! మిక్సీలు వచ్చాక రుచి కాస్త మారింది. కానీ.. అసలు సిసలైన రోటి పచ్చడంటే రోట్లోనే నూరాలి. అప్పుడే దానికి ఆ రుచి! పాతకాలం రోటి పచ్చళ్ల రుచులు చూడాలంటే ఈ రెసిపీలు ట్రై చేయాల్సిందే. ఆరోగ్యకరమైన ఈ పచ్చళ్లు ఇంట్లో అందరికీ నచ్చేస్తాయి.
మినప్పప్పుతో..
కావాల్సినవి : మినప్పప్పు : ముప్పావు కప్పు, నూనె, ధనియాలు : ఒక్కోటి రెండు టీ స్పూన్లు, ఎండు మిర్చి : ఇరవై, జీలకర్ర : ఒక టీస్పూన్, కరివేపాకు : కొంచెం, వెల్లుల్లి రెబ్బలు : ఎనిమిది, గోరువెచ్చని నీళ్లు, ఉల్లిగడ్డ ముక్కలు,
ఉప్పు : సరిపడా, చింతపండు రసం : రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : పాన్లో నూనె వేడి చేసి అందులో ఎండు మిర్చి వేసి వేగించి పక్కన పెట్టాలి. తర్వాత అదే పాన్లో మినప్పప్పు వేసి దోరగా వేగించాలి. అందులో ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలపాలి. వాటన్నింటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా రోటిలో ఎండు మిర్చి వేసి దంచాలి. అవి మెదిగాక వేగించిన మినప్పప్పు మిశ్రమం వేసి, నీళ్లు పోస్తూ రుబ్బాలి. ఉప్పు వేసి, చింతపండు రసం కూడా కలిపి బాగా రుబ్బాలి. చివరిగా ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఒకసారి రుబ్బితే చాలు.
ఉలవలతో..
కావాల్సినవి :ఉలవలు : అర కప్పు, శనగపప్పు, మినప్పప్పు : ఒక్కో టీస్పూన్,
ఎండు మిర్చి : పది, పచ్చి కొబ్బరి ముక్కలు : అర కప్పు,
చింతపండు : కొంచెం, వెల్లుల్లి రెబ్బలు : ఐదు
తయారీ : పాన్లో నూనె లేకుండా ఉలవలు వేసి వేగించాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్లో నూనె వేడి చేసి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేగించాలి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి కలపాలి. ఇవన్నీ చల్లారనివ్వాలి. రోటిలో ఉలవలు వేసి దంచి పొడి చేయాలి. తర్వాత మిగతావాటిని కూడా వేసి మెత్తగా రుబ్బాలి. చివరిగా నానబెట్టిన చింతపండు వేసి బాగా దంచాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి అవసరమైతే నీళ్లు పోస్తూ రుబ్బాలి. తర్వాత తాలింపు వేసుకుంటే సరి.
►ALSO READ | టెక్నాలజీ : వాయిస్ ట్రాన్స్లేషన్తో ఒరిజినల్ వీడియోలా!
నువ్వులతో..
కావాల్సినవి : నువ్వులు : ఒక కప్పు, పచ్చిమిర్చి : నాలుగు, ధనియాలు : ఒక టీస్పూన్, ఉప్పు, నీళ్లు, నూనె : సరిపడా
నానబెట్టిన చింతపండు : ఒక టేబుల్ స్పూన్
బెల్లం : చిన్న ముక్క ఆవాలు : అర టీస్పూన్, ఎండు మిర్చి : రెండు, కరివేపాకు : కొంచెం
తయారీ: నువ్వుల్ని నూనె లేకుండా దోరగా వేగించి, దంచి పొడి చేసుకోవాలి. ఆ పొడిని పక్కన పెట్టి రోట్లో వేగించుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, ఉప్పు వేయాలి. వాటితోపాటు నానబెట్టిన చింతపండు, బెల్లం కూడా వేసి, నీళ్లు పోస్తూ మెత్తగా దంచాలి. అందులో నువ్వుల పొడి కూడా వేసి రుబ్బాలి. ఆ తర్వాత తాలింపు కోసం నూనె వేడి చేసి ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. ఆ తాలింపును పచ్చడిలో వేసి కలుపుకోవాలి.
