యాదగిరిగుట్ట, వెలుగు: శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరికొండ చుట్టూ అయ్యప్పస్వాములు సోమవారం ‘గిరిప్రదక్షిణ’తో పోటెత్తారు. సోమవారం తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద నరసింహస్వామి పాదాలకు అయ్యప్పస్వాముల తో కలిసి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గిరిప్రదక్షిణ ప్రారంభించారు.
రాష్ట్ర నలుమూలల నుంచి అయ్యప్ప స్వాములు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ మార్గంలో రద్దీ నెలకొంది. కొండ చుట్టూ అయ్యప్పస్వాములే కనిపించారు. నారసింహుడి నామస్మరణ, అయ్యప్ప శరణు ఘోషలో గుట్ట పరిసరాలు మార్మోగాయి.
రెండున్నర కిలోమీటర్లు కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం గర్భగుడిలో నారసింహుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థాన ఆఫీసర్లు ప్రత్యేక దర్శనం సదుపాయం కల్పించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. సుమారు 20 వేల మంది అయ్యప్పస్వాములు పాల్గొన్నారని ఆలయ అధికారులు తెలిపారు.
