బద్వేల్ ఉప ఎన్నికల బరిలో 15మంది

బద్వేల్ ఉప ఎన్నికల బరిలో 15మంది

కడప: జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల బరిలో 15మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా.. పరిశీలనలో 9 మంది అనర్హులుగా తేలడంతో వారి నామినేషన్ పేపర్లను తిరస్కరించారు. బుధవారం నామినేషన్ల ఉప సంహరణ గడువు చివరి రోజున ముగ్గురు బరిలో నుంచి తప్పుకోవడంతో చివరకు 15 మంది పోటీలో నిలిచారు. 
సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య  చనిపోవడంతో బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ పార్టీ  బద్వేలు టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. దీంతో సంప్రదాయం మేరకు పోటీ చేయరాదని ప్రతిపక్ష టీడీపీ, జనసేన నిర్ణయించగా.. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. బీజేపీ పనతల సురేశ్ ను తమ అభ్యర్థిగా బరిలో దించింది. దీంతో పోటీ అనివార్యంగా మారింది. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేసే పనిలో పడ్డారు.