
- శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
- చిరంజీవులు రచించిన హిస్సా ఇజ్జత్ హుకుమత్ పుస్తకావిష్కరణ
హైదరాబాద్సిటీ, వెలుగు: బీసీలు రాజ్యాధికార సాధన పోరాటానికి నడుం బిగించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు రచించిన ‘హిస్సా ఇజ్జత్ హుకుమత్’బీసీ రాజ్యాధికార సిద్ధాంతం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు.
రాజకీయ ఆర్థిక రంగంలో బీసీలు అణిచివేతకు గురవుతున్నారని, ఆ వివరాలను గణంకాలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ, బీసీలు చైతన్యం తెచ్చుకొని అధికారం, హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న విధంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల చాలా నష్టపోయామన్నారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీలు రాజ్యాంగపరమైన పరిజ్ఞానం పెంచుకొని చట్టబద్ధమైన రిజర్వేషన్లు సాధించేందుకు పోరాటాలు చేయాలని సూచించారు.
బీజేపీ నేత వకులాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ, నేటి తరానికి ఈ పుస్తకం మార్గదర్శకం చేస్తుందని చెప్పారు. జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ, ఈ పుస్తకం రాజ్యాధికారానికి ఆయుధంగా మారుతుందని పేర్కొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు మాట్లాడుతూ, తాను ఎంతో అధ్యయనం చేసి ఈ పుస్తకం రాశానని, బీసీలు ఈ పుస్తకాన్ని చదవాలని కోరారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఐపీఎస్ పూర్ణచంద్రరావు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు గౌడ సంఘాల సమన్వయ కమిటీ, ప్రముఖ రచయిత సంగిశెట్టి శ్రీనివాస్, చామకూర రాజు, కేవీ గౌడ్, గుజ్జ సత్యం, ఎర్రమాద వెంకన్న, దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్ ,చెన్న శ్రీకాంత్, కర్నాటి మనోహర్, బొమ్మ రఘురాం నేత, సింగం నాగేశ్వర్ గౌడ్,లింగేష్ యాదవ్ నకిరెకంటి శ్రీనివాస్, కొండల్ గౌడ్, దాసు సురేశ్ పాల్గొన్నారు.