
మానకొండూర్/ తిమ్మాపూర్, వెలుగు: రైతును రాజును చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యమని కరీంనగర్ ఎంపీ, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారంలో కృషి విజ్ఞాన కేంద్రం (జమ్మికుంట) ఆధ్వర్యంలో మంగళవారం రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం(ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్–ఎఫ్పీఓ) మొదటి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ప్రధాని మోడీ నిర్వహించిన పీఎం కిసాన్ స్కీం వర్చువల్ మీటింగ్ ను రైతులతో కలిసి సంజయ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పథకం 11వ విడత కింద ప్రధాని మోడీ రైతుల ఖాతాల్లో రూ. 21 వేల కోట్లు జమ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు 2.30 లక్షల మంది రైతులకు మొత్తం రూ. 400 కోట్లకుపైగా నిధులు జమ అయినట్లు వెల్లడించారు. రైతులకు ఎరువులపై కేంద్రం సబ్సిడీ ఇస్తోందని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తుందన్నారు. మానకొండూర్ ఎఫ్పీఓలో 720 మంది సభ్యులు చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్పీఓ అభివృద్ధి కోసం సహకారం అందిస్తామన్నారు. ఎఫ్పీఓకు కేంద్రం నుంచి రూ.15 లక్షల గ్రాంటు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఏవో శ్రీధర్, ఏడీఏ శ్రీనివాస్, అన్నారం సర్పంచ్ బొట్ల కిషన్, నిజాయతీ గూడెం సర్పంచ్ బోళ్ల మురళీధర్, ఎంపీటీసీలు రంగు భాస్కరాచారి, గుర్రాల వెంకట్ రెడ్డి, బీజేపీ నాయకులు, సొల్లు అజయ్ వర్మ, రాపాక ప్రవీణ్, గుడిపాటి జితేందర్ రెడ్డి, వెంకట సాయి, రైతులు పాల్గొన్నారు.
సర్పంచులు చేసే ఆందోళనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు
త్వరలోనే మౌన దీక్ష చేపడుతాం: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: న్యాయమైన డిమాండ్ల కోసం సర్పంచులు చేసే ఆందోళనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. సర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం త్వరలోనే మౌన దీక్ష చేపడుతామని తెలిపారు. సర్పంచులు అధైర్య పడవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంగళవారం వారికి రాసిన ఓ లేఖలో ఆయన కోరారు. ‘‘మీకు బీజేపీ అండగా ఉంటుంది. టీఆర్ఎస్ సర్కార్ 73, 74 వ రాజ్యాంగ అధికరణలకు తూట్లు పొడుస్తున్నది. గ్రామాలు స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యం” అని పేర్కొన్నారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచుల పట్ల జిల్లా అధికారుల వేధింపులు ఆపాలన్నారు. -పంచాయతీల అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నదని మండిపడ్డారు. 2014 లో టీఆర్‌ఎస్ ‘‘గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ’’ పై ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సగర్వంగా తలెత్తుకునేలా చేసే బాధ్యత బీజేపీదేనని పేర్కొన్నారు. ‘‘గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం ... గ్రామ స్వరాజ్యం సాదిద్ధాం... రాష్ట్రంలో రామరాజ్యం నిర్మించుకుందాం” అని సంజయ్ తెలిపారు.