బీసీలకు న్యాయం చేయాలని నిరసన : చక్రహరి రామరాజు

బీసీలకు న్యాయం చేయాలని నిరసన : చక్రహరి రామరాజు
  • కేంద్ర, రాష్ట్ర దిష్టిబొమ్మలు దహనం చేసిన బీసీ నాయకులు 

నల్గొండ అర్బన్, వెలుగు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంచిస్తున్నాయని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో  బీసీలను రాజకీయ సమాధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో 46 తీసుకువచ్చిందని బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు అన్నారు. మంగళవారం నల్గొండలోని గడియారం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవో  46 బీసీలకు గుదిబండ లాగా మారిందన్నారు.  జిల్లాలో 2019లో బీసీలకు 164 స్థానాలు ఉండగా ఈ జీవో ప్రకారం 140 స్థానాలు మాత్రమే కేటాయించిందన్నారు.  కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కే. శంకర్ ముదిరాజ్, చొల్లేటి ప్రభాకర్, కాసోజు విశ్వనాథం, నల్ల సోమ మల్లన్న, నకరికంటి కాశయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నార్కట్​పల్లి, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 46 జీవోను రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల  మోదీరాందేవ్ అన్నారు. మంగళవారం 46 జీవోను రద్దు చేయాలని నార్కట్​పల్లి బస్టాండ్ నుండి నల్గొండ చౌరస్తా వరకు విద్యార్థులు నాయకులుతో  మహార్యాలీగా వచ్చి నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌‌ను అమలు చేయాలన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగోర్ల మోడీ రాందేవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి వంశీ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.