బీసీలను మోసం చేసిన ప్రభుత్వాలు : బీసీ నాయకులు

బీసీలను మోసం చేసిన ప్రభుత్వాలు : బీసీ నాయకులు
  • ఆసిఫాబాద్​లో దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకున్న పోలీసులు
  • బీసీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
  • పలు చోట్ల ర్యాలీలు ఆందోళనలు

ఆసిఫాబాద్/ఆదిలాబాద్/నేరడిగొండ/కోటపల్లి/చెన్నూరు/కోల్​బెల్ట్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ జేఏసీ మండిపడ్డారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ఆసిఫాబాద్​జిల్లా కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు బీసీ నేతలు యత్నించిగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారికి, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్నర్ రమేశ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 

ఆసిఫాబాద్ జిల్లాలో  335 గ్రామ పంచాయతీలుంటే కేవలం 20 స్థానాలను బీసీలకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చీకటి ఒప్పంద కారణంగానే బీసీ రిజర్వేషన్ కేటాయించకుండా ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు. బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఎ.ప్రణయ్, బీసీ విద్యార్థి సంఘం  జిల్లా అధ్యక్షులు లాహుకుమార్, బీసీ రైతు అధ్యక్షులు మారుతీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతాం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరు ఆగదని బీసీ సంక్షేమ సంఘం ఆదిలాబాద్ అధ్యక్షుడు చికాల దత్తు అన్నారు. కలెక్టరేట్ ఎదుట బీసీ పోరాట దీక్ష 
చేపట్టారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. 

పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని నేరడిగొండ బీసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. పంచాయితీ రిజర్వేషన్లలో నేరడిగొండ మండలంలో గల 32 గ్రామ పంచాయితీలకు గానూ ఎస్టీలకు 18 , ఎస్సీలకు 02 , జనరల్ 12 స్థానాలు కేటాయించగా బీసీలకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. 

బీసీలకు తీవ్ర అన్యాయం

మంచిర్యాల జిల్లా కోటపల్లిలో  బీఆర్ఎస్, బీజేపీ బీసీ నేతలు బీసీల నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని మండిపడ్డారు. బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎంపీడీవోకు మెమొరాండం అందజేశారు.

 చెన్నూరులో బీసీ జేఏసీ నేతలు జలాల్ పెట్రోల్ బంక్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్​కు వినతిపత్రం అందించి, తెలంగాణతల్లి చౌరస్తాలో 46 జీవో ప్రతులను దహనం చేశారు. కేంద్రంపై ఒత్తిడిచేసి పార్లమెంట్​లో బీసీ బిల్లు పెట్టి, 42శాతం రిజర్వే షన్ బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. మందమర్రిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్​ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.