
జనగామ, వెలుగు: లోకల్ బాడీస్ ఎలక్షన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ రిజర్వేషన్ అమలుతో బీసీ సీట్లు పెరిగి ఆ వర్గం ప్రజలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. రిజర్వేషన్లు ఖరారుతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టగా, పల్లె రాజకీయం వేడెక్కుతోంది.
బీసీ వర్గాల్లో ఫుల్ జోష్..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లలో బీసీలకు 42 శాతం అవకాశం ఇవ్వడంతో ఫుల్ జోష్ నెలకొంది. గత ఎన్నికలతో పోలిస్తే సంఖ్య పెరగడంతో ఆనందంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 75 జడ్పీటీసీ స్థానాలు ఉంటే 31 స్థానాలు బీసీలకు కేటాయించారు. ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లోనూ ఇదే తీరుగా రిజర్వేషన్ ఉండడంతో బీసీల ప్రాతినిథ్యం పెరిగినట్లైంది.
గత ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తక్కువగా ఉండడంతో పలువురు బలమైన బీసీ లీడర్లు జనరల్ స్థానాల్లో టికెట్లు తెచ్చుకుని పోటీ పడ్డారు. ఇప్పుడు తమకు కేటాయించిన సీట్లల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సర్కారు తీసుకున్న రిజర్వేషన్ నిర్ణయం పై బడుగు బలహీన వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
రిజర్వేషన్‌తో ఆనందం..
రిజర్వేషన్ల అనుకూలంగా వచ్చిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్ ఎస్సీ మహిళ, జడ్పీటీసీ ఎస్సీ జనరల్, ఎంపీపీ ఎస్సీ మహిళలకు కేటాయించడంతో ఆ వర్గాల్లో సంతోషం నెలకొంది. చాలా ఏండ్ల తర్వాత కీలక స్థానాలు ఎస్సీలకు కేటాయించడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో లీడర్లు తలమునకలయ్యారు. కాగా, గత ఎన్నికల్లో ఇక్కడి జడ్పీ చైర్మన్ జనరల్, జడ్పీటీసీ జనరల్ మహిళ, ఎంపీపీ జనరల్ గా ఉండగా, ఇప్పుడు ఎస్సీలకు కేటాయించబడ్డాయి.
పల్లెల్లో మారిన సీన్
పల్లెల్లో ఎక్కడ చూసినా ఎలక్షన్ల చర్చ కనిపిస్తోంది. రిజర్వేషన్ వచ్చిన సామాజిక వర్గంలో బలమైన లీడర్లు ఏ పార్టీలో ఎవరున్నారనే చర్చలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తమ సత్తా చాటేందుకు ఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామలో ఉన్నారు.
మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో జనగామ ఎలక్షన్లు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ లీడర్లు మాత్రం అధికారంలో ఉన్న తమకే అనుకూలంగా ఉంటుందనే ధీమాతో బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు చేస్తోంది. ఇరు పార్టీల్లోనూ ఆశావహులు ఎలాగైనా టికెట్దక్కించుకునే పనిలో పడ్డారు.