
- రెడ్డి జాగృతికి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
బషీర్బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో రెడ్డి జాగృతి వేసిన పిటిషన్లను ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశాచారి అధ్యక్షతన ‘బీసీ రిజర్వేషన్ల పెంపు-హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు, -భవిష్యత్ కార్యాచరణ’ పై బీసీ సంఘాలు, మేధావులు, కుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టులో వేసిన పిటిషన్ ను 24 గంటల్లో ఉపసంహరించుకోవాలని కోరారు. లేకపోతే బీసీలకు రెడ్లను రాజకీయ శత్రువులుగా ప్రకటిస్తామని, 2028 ఎన్నికల్లో ఒక్క రెడ్డి అభ్యర్థిని కూడా గెలవనివ్వబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో నారగోని, దాసు సురేష్, మణిమంజరి, కులకచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.