V6 News

మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్

మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్

మాజీ క్రికెటర్లు..మాజీ అంపైర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. మెన్ అండ్ ఉమెన్ క్రికెటర్లు, అంపైర్ల నెలవారీ పెన్షన్లను బీసీసీఐ భారీగా పెంచింది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న మాజీలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సరికొత్త పెన్షన్  విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త విధానం ప్రకారం.. ఇప్పటి దాకా నెలకు రూ.15 వేలు పెన్షన్ అందుకుంటున్న మాజీ క్రికెటర్లు, అంపైర్లు ఇకపై రూ. 30 వేలు పొందనున్నారు. అలాగే రూ.22,500 అందుకుంటున్న వారు రూ.45,000, రూ. 30 వేలు పెన్షన్ పొందుతున్న వారు.. రూ.52 వేలు, రూ.37,500 అందుకునేవారు ఇకపై రూ.60,000 మొత్తాన్ని పెన్షన్ గాను తీసుకోనున్నారు. అలాగే రూ. 50,000 పొందుతున్న మాజీ క్రికెటర్లు, అంపైర్లు  రూ.70,000 పెన్షన్ అందుకోనున్నారు. నూతన పెన్షన్  విధానం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది.

మాజీల ఆర్థిక పరిస్థితి బాగాలేదు..
మాజీ క్రికెటర్లు, అంపైర్లకు ఆర్థికంగా అండగా ఉండేందుకు నూతన పెన్షన్ విధానాన్ని తీసుకోచ్చినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. కొందరు అంపైర్లు, క్రికెటర్లు ఆర్థికంగా బాగానే ఉన్నా..ఎక్కువ మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్లేయర్లు లైఫ్ లైన్ లాంటి వారని..వారి క్రికెట్ జీవితం ముగిసిన తర్వాత కూడా..మాజీ క్రికెటర్లకు అండగా ఉండటం బోర్డు కర్తవ్యమని గంగూలీ అన్నారు. అటు అంపైర్లు అన్ సంగ్ హీరోలన్నారు గంగూలీ. వారు క్రికెట్ కు అందించిన సేవలకు బీసీసీఐ అండగా నిలుస్తుందన్నారు. 

మాజీల సంక్షేమానికి ప్రాధాన్యత..
మాజీ క్రికెటర్లు, అంపైర్ల సంక్షేమానికి బీసీసీఐ ప్రాధాన్యత ఇస్తుందన్నాడు బీసీసీఐ కార్యదర్శి జైషా.  ఇందులో భాగంగానే  వారికి అందే పెన్షన్ మొత్తాలను పెంచినట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా క్రికెట్ కు అందించిన సేవలను బీసీసీ విలువైనదిగా భావిస్తోందని తెలిపారు. ఆ సేవలకు ఈ విధంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన పెన్షన్ విధానం ద్వారా.. 900మంది ప్లేయర్లు, అంపైర్లు  లబ్ధి పొందనున్నారని వెల్లడించారు.