సర్వే చేసిన ప్రతీ సెంటు..పోడు భూమికి పట్టాలివ్వాలి

సర్వే చేసిన ప్రతీ సెంటు..పోడు భూమికి పట్టాలివ్వాలి

ములకలపల్లి, వెలుగు: సర్వే చేసిన ప్రతీ సెంటు పోడు భూమికి  పట్టాలు ఇవ్వాలని  తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గౌరీ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని సర్వే చేసి హక్కు పత్రాలు కల్పించని పోడు సాగుదారులతో  కలిసి సోమవారం  భద్రాచలం ఐటీడీఏ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఐటీడీఏ డీటీ శ్రీనివాసరావుకు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సర్వే చేసి ప్లాంటేషన్ పేరుతో ఆపుతున్న పోడు రైతులందరికీ హక్కులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. హక్కు పత్రాలు ఇచ్చిన పోడు రైతులందరికీ రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసీలపై చూపుతున్న వివక్షను వెంటనే విరమించుకోవాలని, వలస ఆదివాసీలకు కూడా హక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ పోడియం వెంకటేశ్వర్లు, నాగబాబు, హనుమ, రోజా, సత్యం, తదితరులు పాల్గొన్నారు.