ఈజీఎస్ స్కీమ్ ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 ఈజీఎస్ స్కీమ్ ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఖమ్మంలో కాంగ్రెస్​ ఆవిర్భావ వేడుకల్లో భట్టి విక్రమార్క

ఖమ్మం, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ (ఈజీఎస్‌‌‌‌‌‌‌‌) పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఆదివారం ఖమ్మం డీసీసీ ఆఫీసులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దేశ సంపద, వనరులు కార్పొరేట్ సంస్థలకు పంచేందుకు కాదని, పేదలకు పంచడానికని అన్నారు. గొప్ప ఆశయంతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఈజీఎస్ పథకాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ప్రపంచమంతా కొనియాడిన గాంధీని స్వాతంత్ర్యం వచ్చిన ఆరు నెలలకే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు హత్య చేసినా ఆయన ఆలోచనను నిర్మూలించలేకపోయారన్నారు. 

శతాబ్దాలుగా ఈ దేశప్రజలు కుల, మత భేదం లేకుండా కలిసి జీవిస్తున్నారని, కొందరు రాజకీయ లబ్ధి కోసం కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం, పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రను ఎండగట్టేందుకు గ్రామ గ్రామాన పోరాడుతామని స్పష్టం చేశారు. దేశానికి కాంగ్రెస్ చేసిన సేవలు ప్రజలకు వివరించేందుకు జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఆ రోజు ప్రతి ఇంటిపైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, కాంగ్రెస్ భావజాలాన్ని వివరిస్తూ కరపత్రాలు పంచాలని, కండువాలు ధరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, పార్టీ నేతలు పాల్గొన్నారు.