100 సీట్లలో గెలుస్తాం అని సీఎం కేసీఆర్ అనడం మేకపోతు గాంభీర్యమే

100 సీట్లలో గెలుస్తాం అని సీఎం కేసీఆర్ అనడం మేకపోతు గాంభీర్యమే
  • కేసీఆర్ కు గజ్వేల్ లో ఓటమి భయం: భట్టి
  •  100 సీట్లలో గెలిచే సీన్​ బీఆర్ఎస్​కు లేదు
  •  జనగామ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర

జనగామ, వెలుగు: రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తున్నదని కేసీఆర్​కు ఇంకో చాన్స్ ఇస్తే ఆర్థిక పరిస్థితి శ్రీలంకలా మారుతుందని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన జనగామ జిల్లాలోని చిల్పూరు మండలం నుంచి తరిగొప్పుల మండలంలోని అబ్దుల్ నాగారం, నర్సాపూర్, మరియపురం, నర్మెట్ట వరకు పాదయాత్ర చేపట్టారు. అబ్దుల్ నాగారం వద్ద మీడియాతో మాట్లాడారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో 100 సీట్లలో గెలుస్తాం అని సీఎం కేసీఆర్ అనడం మేకపోతు గాంభీర్యమే అన్నారు. ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ లోనే గెలుసుడు కష్టం అనే ఆలోచనతో అక్కడ పోటీ చేయాలా వద్దా అనే సర్వేలు చేయించుకుంటున్నాడని చెప్పారు. రేవంత్ రెడ్డికి తనకు మధ్య ఎటువంటి వర్గపోరు లేదన్నారు. తెలంగాణలో అందినకాడికి దండుకునుడే లక్ష్యంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని భట్టి ఆరోపించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై టోల్ వసూళ్ల కోసం ఓ సంస్థతో 30 ఏండ్ల ఒప్పందం చేసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ‘‘మద్యం అమ్మకాలను 36 వేల కోట్లుకు పెంచినందుకా..? లిక్కర్ స్కాంలోనా? కాళేశ్వరం అవినీతిలోనా..? మిషన్ భగీరథ, కాకాతీయ స్కాంలలోనా..? అడ్డగోలుగా సర్కారు భూములను అమ్మడంలోనా..? ఏ విషయంలో  దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అనేది కేటీఆర్​చెప్పాలె’’ అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత ఘర్షణలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు.​

కొమ్మూరి వర్సెస్ పొన్నాల

భట్టి పాదయాత్రలో పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. యాత్ర తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం వద్ద జనగామ నియోజకవర్గంలోకి ప్రవేశించగా పొన్నాల, కొమ్మూరి వర్గం లీడర్లు స్వాగతం పలికారు. బల ప్రదర్శనలో భాగంగా ఇరు వర్గాలు జై పొన్నాల.. జై కొమ్మూరి అంటూ నినాదాలు చేశారు. ఒకరిని ఒకరు తోసుకుని తిట్ల దండకం అందుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో విసిగిపోయిన భట్టి పాదయాత్ర స్పీడ్ పెంచారు. అబ్దుల్ నాగారం శివారు లంచ్ పాయింట్ వద్ద ప్రెస్​ మీట్ పెట్టారు. ప్రెస్​మీట్ లో పాల్గొనేందుకు కొమ్మూరి టెంట్ వద్దకు రాగా పొన్నాల వర్గం అడ్డుకుంది. దీంతో మళ్లీ అరగంట పాటు ఇరువర్గాల మధ్య తీవ్రతోపులాట, దూషణల పర్వం నెలకొంది.  జనగామ జిల్లా నర్మెట్టలో సైతం పొన్నాల గో బ్యాక్​ అంటూ  కొమ్మూరి వర్గం నినాదాలు చేసింది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.