శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేస్తం: భట్టి విక్రమార్క

శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేస్తం: భట్టి విక్రమార్క
  • హౌసింగ్ బోర్డులు పెట్టి ఏరియాల వారీగా డెవలప్ చేస్తాం
  • నివాస స్థలాలను మధ్య తరగతికి అందుబాటులోకి తెస్తం
  • గోదావరి, కృష్ణా, మూసీ నదులను అనుసంధానం చేస్తం
  • స్వచ్ఛమైన నీరు పారేలా చర్యలు తీసుకోబోతున్నాం
  •  ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యన టెక్స్ టైల్, గ్రానైట్, ఐటీ సెక్టార్స్
  • సీఐఐ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పేద, మధ్యతరగతి  ప్రజలు ఇండ్లు, జాగాలు కొనలేని పరిస్థితి ఏర్పడిందని, ఇండ్ల జాగాలను అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా శాటిలైట్ టౌన్ షిప్ లను డెవలప్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఇవాళ సీఐఐ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు బర్కత్ పురా, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లిలో హౌసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. అదే తరహాలో శాటిలైట్ టౌన్ షిప్స్ డెవలప్ చేస్తామ న్నారు. గోదావరి, కృష్ణా, మూసీ నదులను అనుసంధానం చేస్తామని తెలిపారు. స్వచ్ఛమైన నీరు పారేలా మూసీని అభివృద్ధి చేయబోతున్నామని అన్నారు. మూసి పరీవాహక ప్రాంతంలో చెక్ డ్యామ్, చిల్డ్రన్ పార్క్, ఫ్లై ఓవర్స్, ఎంటర్టైన్మెంట్, బోటింగ్ తదితర ఎస్సెట్స్ ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయబోతున్నట్టు భట్టి విక్రమార్క వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యన అనేక క్లస్టర్లను అభివృద్ధి చేయబోతున్నామని అన్నారు.

 హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం 30వేల ఎకరాల్లో ఒకే చోట ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా సిటీని రద్దు చేసి అనేక ఫార్మా విలేజ్ లను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు.  ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్యన టెక్స్టైల్, గ్రానైట్, ఐటీ తదితర క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని అన్నారు. వాణిజ్య పంటల ద్వారా రైతులు ఆర్థికంగా బలపడటంతోపాటు పరిశ్రమల యజమానులు సైతం ఆదాయం పొంద వచ్చన్నారు. హైదరాబాదుకు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలకు కావలసినంత భూమి తెలంగాణలో అందుబాటులో ఉందని  చెప్పారు.