తమ్ముడు లవ్ మ్యారేజ్.. అన్న పరువు హత్య.. సజీవ దహనం చేసిన యువతి తండ్రి

తమ్ముడు లవ్ మ్యారేజ్.. అన్న పరువు హత్య.. సజీవ దహనం చేసిన యువతి తండ్రి
  • ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి ఇష్టమొచ్చినట్టు దాడి
  • నవాబ్​పేట అడవుల్లోకి తీసుకెళ్లి మర్డర్ 
  • రంగారెడ్డి  జిల్లాలో పరువు హత్య

షాద్​నగర్, వెలుగు: తమ్ముడి ప్రేమ అన్నకు శాపంగా మారింది. సోదరుడు లవ్ మ్యారేజ్  చేసుకున్నందుకు అతను బలయ్యాడు. యువకుడిని తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆ యువకుడి అన్నను యువతి తండ్రి చంపేశాడు. ఈ పరువు హత్య రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో జరిగింది. ఫరూక్ నగర్  మండలం ఎల్లంపల్లి గ్రామం దళిత కుటుంబానికి చెందిన ఎర్ర రాజశేఖర్  తమ్ముడు చంద్రశేఖర్  అదే గ్రామానికి చెందిన బీసీ సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమికులిద్దరూ ఇటీవలే  హైదరాబాద్ కు పారిపోయి పెండ్లి చేసుకున్నారు. 

దీంతో యువతి తండ్రి వెంకటేశ్.. చంద్రశేఖర్  కుటుంబంపై పగ పెంచుకున్నాడు. మరికొందరితో కలిసి చంద్రశేఖర్  అన్న రాజశేఖర్ ను టార్గెట్  చేశాడు. నవంబర్ 12న రాత్రి 11 గంటలకు రాజశేఖర్ ను బలవంతంగా ఇంట్లో నుంచి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని సృహ తప్పేలా తీవ్రంగా కొట్టి కాళ్లు చేతులు కట్టేశారు. తర్వాత బాధితుడిని నవాబుపేట శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సజీవ దహనం చేశారు. 

ఈ ప్రేమ వ్యవహారంతో రాజశేఖర్ కు ఏమాత్రం సంబంధం లేకపోయినా అతడిని హత్య చేశారు. ఈ పరువు హత్య షాద్ నగర్  పరిధిలో సంచలనం సృష్టించింది. కాగా.. రాజశేఖర్ ను ఇంట్లో నుంచి తీసుకుపోయిన రోజే అతని కుటుంబ సభ్యులు 100కు సమాచారం ఇచ్చారు. అతని మృతదేహాన్ని ఆదివారం కనుగొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి

ప్రేమ వ్యవహారంతో సంబంధం లేని అమాయకుడిని చంపిన వారిని ఉరితీయాలని రాజశేఖర్  కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్థానిక దళిత నేతలు డిమాండ్  చేశారు. ఆదివారం షాద్ నగర్ చౌరస్తాలో పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాజశేఖర్ ను కిడ్నాప్  చేసిన రోజే అతని కుటుంబ సభ్యులు 100కు సమాచారం ఇచ్చారని, అయినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసుల నిరక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వారు సరైన టైంలో స్పందించి ఉంటే రాజశేఖర్  ప్రాణాలతో దక్కేవాడన్నారు. వెంటనే దోషులను అరెస్టు చేసి ఉరితీయాలని డిమాండ్  చేశారు.